ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ఏఐ నైపుణ్యాభివృద్ధికి కాలిబో ఏఐ అకాడెమీతో భాగస్వామ్యం ప్రతిపాదించిన సీఎం చంద్రబాబు

Published by
Srinivas

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలిబో ఏఐ అకాడెమీ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజ్ వట్టికూటితో కీలక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని యువతకు భవిష్యత్‌కు అవసరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాల్లో శిక్షణ అందించేందుకు కాలిబో ఏఐ అకాడెమీతో పాటు రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. ఏఐ రంగంలో గ్లోబల్ స్థాయి నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా ఏపీ యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

అలాగే, విశాఖపట్నం మధురవాడలోని ఐటీ సెజ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (Center of Excellence)ను ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ఈ కేంద్రం ద్వారా ఏఐ పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ ప్రోత్సాహం, పరిశ్రమ–విశ్వవిద్యాలయ అనుసంధానం వంటి అంశాలకు బలమైన వేదికగా మారుతుందని ఆయన తెలిపారు.

రాష్ట్రాన్ని నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలకు కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై రాజ్ వట్టికూటి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ భేటీ ద్వారా ఏపీలో ఏఐ ఎకోసిస్టమ్ మరింత బలోపేతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అంతర్జాతీయ వేదిక అయిన దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో జరిగిన ఈ సమావేశం, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో కొత్త పెట్టుబడులు మరియు గ్లోబల్ భాగస్వామ్యాలకు మార్గం సుగమం చేస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.