ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ – బెగ్గిలపల్లెలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

Published by
Rahul N

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో, ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్లను గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లి మండలంలో ఉన్న బెగ్గిలపల్లె గ్రామంలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్దిదారులను కలుసుకుని, వారికి నేరుగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు.

అధికారిక గణాంకాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 62,94,844 మంది పింఛన్ లబ్దిదారులు ఉండగా, ఉదయం 10.30 గంటల సమయానికి 38,18,798 మందికి (60.67 శాతం) పింఛన్ల పంపిణీ పూర్తయ్యింది.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పింఛన్ల పంపిణీ జరగడం వల్ల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సహా లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో ఆర్థిక సహాయం అందుతోందని ప్రభుత్వం పేర్కొంది.

Rahul N