వార్తలు

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య… గుండెపోటుగా చిత్రీకరణ

Published by
Rahul N

రోజు రోజుకీ ఇలాంటి కేసులు పెరిగి పోతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. దుగ్గిరాల మండలం లోని చిలువూరు గ్రామంలో రెండు రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతిచెందిన లోకం శివనాగరాజు కేసు సంచలన మలుపు తిరిగింది. పోలీసుల విచారణలో ఇది హత్యేనని నిర్ధారణకు వచ్చారు.

తెలిసిన సమాచారం ప్రకారం, శివనగరాజుకు 2007లో లక్ష్మీ మాధురితో వివాహం జరిగింది. దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండగా, లక్ష్మీ మాధురి విజయవాడలోని ఓ సినిమా థియేటర్‌లో టికెట్ కౌంటర్‌లో పనిచేసేది. అక్కడే గోపీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, క్రమంగా అది వివాహేతర సంబంధంగా మారింది.

భర్త వ్యాపారం నచ్చక, గోపీ నిర్వహిస్తున్న హైదరాబాద్ కార్ ట్రావెల్స్‌లో ఉద్యోగం చేయాలని శివనాగరాజును లక్ష్మీ మాధురి ప్రోత్సహించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. అయితే కొద్ది రోజులకే శివనాగరాజు స్వగ్రామానికి తిరిగి రావడంతో, తన అక్రమ సంబంధానికి అడ్డుగా మారాడని భావించి అతడిని తొలగించాలనే నిర్ణయానికి ఆమె వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ క్రమంలో ఒక రాత్రి భర్త కోసం వండిన బిర్యానీలో సుమారు 20 నిద్రమాత్రలు కలిపి ఇచ్చినట్లు, శివనాగరాజు గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత ప్రియుడిని ఇంటికి పిలిచి, ఇద్దరూ కలిసి అతడిని హత్య చేసినట్లు విచారణలో తేలింది. అనంతరం ఉదయం స్థానికులను పిలిచి గుండెపోటుతో భర్త మృతిచెందినట్లు నాటకీయత సృష్టించినట్లు పోలీసులు తెలిపారు.

మృతదేహం చెవిలో నుంచి రక్తం రావడం, ముఖంపై గాయాలు ఉండటాన్ని గమనించిన స్నేహితులు శివనాగరాజు తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి లోతైన విచారణ చేపట్టిన పోలీసులు, ఛాతీ ఎముకలు విరిగి ఊపిరాడక మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా నిర్ధారించారు.

దీంతో లక్ష్మీ మాధురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా, ప్రియుడితో కలిసి తానే భర్తను హత్య చేసినట్లు ఆమె అంగీకరించినట్లు తెలిపారు. గోపీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Rahul N