తిరుపతి-పళని మధ్య నూతన ఆర్టీసీ బస్సు సేవను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం, ప్రయాణానికి ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడం గర్వించదగిన విషయం అని ఆయన పేర్కొన్నారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వేద పండితుల శాస్త్రోక్త పూజల అనంతరం, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో కలిసి బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, “ఈ ఏడాది ఫిబ్రవరిలో షష్ట షణ్ముఖ యాత్రలో భాగంగా తమిళనాడులోని పళని కొండపై శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాను. అక్కడి భక్తులు తిరుపతికి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విన్నాను. రెండు మూడు మార్లు బస్సులు మారాల్సి వస్తుండటంతో ప్రయాణం కష్టంగా మారిందని తెలిపారు. తమిళనాడు కందన్ ఛారిటబుల్ ట్రస్ట్, పళని టౌన్ సిటిజన్ ఫోరమ్ సభ్యులు బాలాజీ, సుబ్రహ్మణ్యం వినతి పత్రం ఇచ్చారు. వెంటనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా, అరగంటలోనే అనుమతి లభించింది.” అని వెల్లడించారు.
భక్తుల ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేందుకు రెండు లగ్జరీ బస్సులు అందుబాటులోకి తీసుకురాబడినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, “తిరుపతి – పళని రెండు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు. ఈ రెండు పుణ్యక్షేత్రాలను బస్సు ద్వారా అనుసంధానం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. భక్తుల అభీష్టం మేరకు ఈ సేవలను అందించడం వల్ల అందరికీ మేలు కలుగుతుంది. ఈ కొత్త బస్సు సర్వీసులు రెండు రాష్ట్రాల భక్తుల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని పెంచేందుకు దోహదం చేస్తాయి.” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ , ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ బస్సు సేవ ద్వారా తిరుపతి – పళని భక్తులకు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రావడంతో, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.