తెలుగువారికి ఆరాధ్యమైన నది, కోట్లాది మందికి జీవనాధారమైన “గోదావరి” తల్లిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయమైన పరిణామం. వచ్చే సంవత్సరం రానున్న పవిత్ర “గోదావరి” పుష్కరాలను పురస్కరించుకుని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు కార్యాచరణ ప్రణాళిక కేవలం ఒక తాత్కాలిక ఏర్పాటు కాదు, అది గోదావరి నదిని కాలుష్యపు కోరల నుండి రక్షించుకునే ఒక పర్యావరణ ఉద్యమం.
పుష్కరాల వేళ కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే నది, నిత్యం కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడటం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన తీసుకున్న నిర్ణయాలు, చూపిస్తున్న పట్టుదల, చేస్తున్న కృషి నది మనుగడ పై కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి.
భయపెడుతున్న కాలుష్య గణాంకాలు…
కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నివేదికలు గోదావరి నది ఎంతటి ప్రమాదకర స్థితికి చేరుకుందో స్పష్టం చేస్తున్నాయి. నిత్యం నదిలోకి చేరుతున్న కాలుష్యాల వివరాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. గోదావరి తీర మున్సిపాలిటీల నుండి ప్రతిరోజూ 104 మిలియన్ లీటర్ల మురుగునీరు నేరుగా నదిలో కలుస్తోంది. రాజమహేంద్రవరం నుంచే ఉత్పత్తయ్యే 75 మిలియన్ లీటర్లలో 50 మిలియన్ లీటర్లు మురుగు నీరు శుద్ధి కాకుండానే నది పాలవుతోంది.
పారిశ్రామిక రసాయన వ్యర్థాలు నదిని విషతుల్యం చేస్తున్నాయి. ఒక్క “ఆంధ్ర పేపర్ మిల్స్” నుండే రోజుకు 32 మిలియన్ లీటర్ల వ్యర్థాలు నదిలోకి, వదలడం పారిశ్రామిక నిర్లక్ష్యానికి పరాకాష్ట. “కోనసీమ”, “పశ్చిమ గోదావరి” జిల్లాల నుండి నిత్యం 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా వ్యర్థాలు గోదావరిని ముంచెత్తుతున్నాయి. ఇవే గాక పరివాహక ప్రాంతాల గ్రామాల్లోని కాలువల ద్వారా రోజుకు 8.38 మిలియన్ లీటర్ల మురుగునీరు నదిలోకి ప్రవహిస్తోంది.
ఈ మహమ్మారి లాంటి కాలుష్యాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళిక చాలా స్పష్టంగా, ఆచరణాత్మకంగా ఉంది. ఆరు జిల్లాల పరిధిలోని 262 పుష్కర పంచాయతీలను “మురుగు నీరు విడుదల రహిత” గ్రామాలుగా తీర్చిదిద్దాలని, ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” ఆదేశించడం గొప్ప మార్పునకు నాంది. అలాగే గ్రామాల్లో VB-G RAM G (వీబీ జీ రాం జీ) పథకం కింద “మ్యాజిక్ డ్రెయిన్లు”, “సామాజిక ఇంకుడు గుంతలు” (కమ్యూనిటీ సోక్ పిట్స్) అంటే ఇళ్లల్లోంచి బయటకు వచ్చే మురుగునీరు, వాష్‌రూమ్ నీరు వృథాగా పోకుండా ఈ గుంతలోకి పంపుతారు. ఈ గుంతలో ఇసుక, కంకర వంటి సహజ వడపోత పదార్థాలు ఉంటాయి. దీనివల్ల నీరు శుభ్రపడి నెమ్మదిగా భూమిలోకి ఇంకిపోతుంది. మరియు వ్యక్తిగత జంట గుంతల (ట్విన్ పిట్స్) నిర్మాణం ద్వారా మురుగునీరు నది వరకు చేరకుండా భూమిలోనే ఇంకిపోయేలా చేయడం ఈ గ్రామీణ వ్యూహం లో భాగం.
అలాగే, రాజమహేంద్రవరం, కొవ్వూరు, నరసాపురం, తణుకు వంటి ప్రధాన పట్టణాల్లో మున్సిపాలిటీల సామర్థ్యానికి తగినట్లుగా మురుగు నీటి శుద్ధి కేంద్రాల (STPs) నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించడం. దీనికోసం పీసీబీ మంజూరు చేసిన రూ. 100 కోట్ల నిధులతో పాటు, స్వచ్ఛాంధ్ర నిధులను కూడా అనుసంధానించడం ద్వారా నిధుల కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు.
సాంకేతికతతో నిరంతర నిఘా
ప్రణాళికలు కాగితాలకే పరిమితం కాకుండా ఉండేందుకు RTGS(రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) తరహాలో ప్రత్యక్ష పర్యవేక్షణ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇది అత్యాధునిక సాంకేతికత (Technology), డేటా అనలిటిక్స్, సీసీ కెమెరాలు, డ్రోన్లు మరియు బయోమెట్రిక్ విధానాలను ఉపయోగించి ప్రభుత్వ పథకాలు, శాంతిభద్రతలు, మరియు అత్యవసర పరిస్థితులను (Real-time లో… అంటే ఎక్కడికక్కడ ప్రత్యక్షంగా) పర్యవేక్షించే ఒక కేంద్రీకృత వ్యవస్థ (Command Control Centre).
సీసీ కెమెరాల ద్వారా పరిశ్రమలు, మున్సిపల్ డ్రెయిన్లను అనుసంధానించడం. దీని వలన ఎక్కడైనా శుద్ధి చేయని మురుగునీరు నదిలోకి వదిలితే తక్షణమే గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవచ్చు. ఈ కంట్రోల్ రూం బాధ్యతలను ఉన్నత స్థాయి “పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్” కి అప్పగించడం ద్వారా పర్యవేక్షణలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయి.
నదులు కేవలం నీటి వనరులు కావు, అవి ఒక సంస్కృతికి, జీవన విధానానికి ప్రతీకలు. జీవనది గోదావరిని కాలుష్య రహితంగా ఉంచడం కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరి కర్తవ్యం. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌పై దశలవారీ నిషేధాన్ని కఠినంగా అమలు చేయడంతో పాటు, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి.
ముగింపు: ఏ నాయకుడికైనా చేయాలనే లక్ష్యం, ఆకాంక్ష ఉంటే ….. ఏదైనా సాధ్యమే….. దానికి నిదర్శనం ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్”. ఆయన పట్టుదల, అధికారుల సమన్వయం ఇలాగే కొనసాగితే… రాబోయే పుష్కరాల నాటికి భక్తులు కాలుష్యరహిత, స్వచ్ఛమైన, పవిత్రమైన గోదావరి జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించే సుదినం రావడం తథ్యం. “స్వచ్ఛ గోదావరి” సాకారం కావాలని ఆశిద్దాం.