ఆంధ్ర ప్రదేశ్

అటవీశాఖకు మార్గ నిర్దేశం చేస్తున్న పవన్ కళ్యాణ్

Published by
Suresh Thota

“వ్యక్తులుగా వారే అంత సాధిస్తే… వ్యవస్థగా ఉండి మనమెంత చేయాలి?”
అటవీ శాఖ సమీక్షలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విధంగా నిలదీశారు.

​ఫోటోల కోసం మొక్కలు నాటడం, రికార్డుల్లో అంకెలు చూపించడం వన సంరక్షణ అనిపించుకోదు. ప్రకృతి పట్ల నిజమైన సంకల్పం, విధుల్లో జవాబుదారీతనం ఉన్నప్పుడే “స్వర్ణాంధ్ర విజన్ 2047” లక్ష్యాలు సాకారమవుతాయి అని, సచివాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశం ద్వారా, ఇది సాధారణ సమీక్ష కాదు అని, అలసత్వానికి అలవాటుపడిన అధికార యంత్రాంగానికి ఒక గట్టి హెచ్చరిక గా, పర్యావరణ పరిరక్షణపై ఆయనకు, ప్రభుత్వ దృఢ సంకల్పానికి నిదర్శనం గా ఈ సమీక్ష నిలిచింది.

ఈ దేశంలో అడవులను కాపాడుకోవడానికి, పచ్చదనాన్ని పెంచడానికి కొందరు వ్యక్తులు తమ జీవితాలనే ధారపోశారు. కోట్లాది మొక్కలు నాటి అద్భుతాలు సృష్టించిన “వనజీవి రామయ్య” , పర్యావరణం కోసం అంకితమైన “దుశ్శర్ల సత్యనారాయణ” వంటి ప్రకృతి, పర్యావరణ ప్రేమికులు ఎటువంటి ప్రభుత్వ అండదండలు లేకపోయినా, స్వార్థం లేకుండా హరిత విప్లవాన్ని సాధించారు. ఒక సాదాసీదా వ్యక్తి ఒంటరిగా అంతటి మార్పును తీసుకురాగలిగినప్పుడు… సకల అధికారాలు, వనరులు, నిధులు, సిబ్బంది ఉన్న అటవీ శాఖ ఎందుకు వెనుకబడి ఉందన్న డిప్యూటీ సీఎం ప్రశ్న అటవీ శాఖ లో అంతర్మధనాన్ని రగిలించకపోదు.

రాష్ట్రంలో 50 శాతం (గ్రీన్ కవర్) పచ్చదనం సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం. “గ్రేట్ గ్రీన్ వాల్” వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేతిలో ఉన్నప్పటికీ, నిర్దేశిత కాలపరిమితి (టైమ్ ఫ్రేమ్) ప్రకారం పనులు జరగకపోవడంపై ఆయన వ్యక్తం చేసిన ఆగ్రహం సమంజసమే. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేయడం పాలనలో రాబోయే మార్పులకు సంకేతం గా భావించాలి.

అటవీ భూములకు జియో ట్యాగ్…

గత ప్రభుత్వాల కాలంలో అటవీ భూములు ఏ విధంగా కబ్జాలకు గురయ్యాయో చెప్పడానికి చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, కడప జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం ఆక్రమించిన భూములే సాక్ష్యం. ప్రస్తుత ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుని, తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించుకున్నది. అయితే ఇది ఇక్కడితో ఆగకూడదు. ​అటవీ భూముల ఆక్రమణలపై శ్వేతపత్రం లాంటి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని, ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అధికారులను ఆదేశించడం పారదర్శకతకు పెద్ద పీఠం వేయడమే. సరిహద్దుల వివాదాలకు తావులేకుండా కర్ణాటక మోడల్‌ తరహాలో “జియోట్యాగ్” ద్వారా స్పేషియల్ సర్వే నిర్వహించడం, శాటిలైట్ సాంకేతికతను వాడుకోవడం ద్వారా అడవిలో చిన్న ఆకు కదిలినా, చెట్టు కూలినా క్షణాల్లో సమాచారం అందేలా అత్యాధునిక వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

​గ్రీన్ కవర్.. కేవలం రికార్డుల కోసమేనా…

మొక్కలు నాటేటప్పుడు ఉండే ఉత్సాహం, ఫోటోలకు ఇచ్చే ఫోజులు, అవి పెరిగి పెద్దయ్యే వరకు ఉండటం లేదనేది చేదు నిజం. “నాటిన ప్రతి మొక్కను ప్రాణంలా కాపాడుకోవాలి” అన్న డిప్యూటీ సీఎం పిలుపు తో అటవీ శాఖ ఆలోచనలను మార్చాలి. 50 శాతం పచ్చదనం సాధించడానికి వారం రోజుల్లో “ఏపీ గ్రీన్ సొసైటీ” ఏర్పాటు కాబోతుండటం శుభపరిణామం. అలాగే, పరిశ్రమలు చట్టప్రకారం “గ్రీన్ బెల్ట్” ఏర్పాటు చేశాయా లేదా అని, నిరంతరం నిశితంగా పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.

నగర వనాలు అంటే ఏదో సిమెంట్ బెంచీలు వేసిన సాధారణ పార్కులు కావు అని, సగటు నగరవాసి అడుగుపెట్టగానే ఒక దట్టమైన అరణ్యంలోకి వచ్చామనే అద్భుతమైన అనుభూతి కలిగేలా వాటి డిజైన్లు మార్చాలి. తీర ప్రాంత రక్షణకు తోట తోపుల పెంపకం, అరణ్యాల నుండి పులులు గ్రామాల్లోకి రాకుండా, వాటి సంచార మార్గాల్లో తాగునీటి కోసం “వాటర్ సాసర్స్” ఏర్పాటు వంటి అంశాలు పర్యావరణ సమతుల్యతపై ప్రభుత్వానికి ఉన్న మైక్రో-లెవెల్ అవగాహనను కనబరుస్తున్నాయి.

2.5 కోట్ల సీడ్ బాల్స్ తో…

విత్తన బంతులు (సీడ్ బాల్స్) చల్లడానికి సాంప్రదాయ వర్షాకాలం సీజన్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదన్న సరికొత్త ఆలోచన అటవీశాఖ విధానంలో మార్పును, వేగాన్ని పెంచుతుంది. జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున 2.5 కోట్ల విత్తన బంతుల తయారీ, పంపిణీ కార్యక్రమాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా, ప్రజా ఉద్యమంలా మార్చాలని, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేయడం ద్వారా పచ్చదనాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించాలని, భావితరాలకు ఆదర్శంగా నిలవాలని ఏపీ డిప్యూటీ సీఎం సంకల్పం చేస్తున్నారు…..

విదేశాల్లో ఉన్న ఎర్రచందనం

ప్రపంచంలోనే కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే అమూల్యమైన “ఎర్రచందనం” గతంలో టన్నుల కొద్దీ విదేశాలకు తరలిపోయింది. చైనా, జపాన్, సింగపూర్ కస్టమ్స్ వద్ద సీజ్ చేయబడి ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన మన అటవీ సంపదను తిరిగి రప్పించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖతో సమన్వయం చేసుకుంటూ, అంతర్జాతీయంగా చట్టపరమైన ప్రక్రియలను వేగవంతం చేసి, ఆ సంపదను రాష్ట్రానికి తిరిగి సంపాదించుకునే విధంగా, భవిష్యత్తులో ఒక్క ఎర్రచందనం చెక్క కూడా సరిహద్దు దాటకుండా నిఘా పెట్టడం తక్షణ కర్తవ్యం అని తెలుపుతూ, ​అటవీ శాఖపై వచ్చే దుష్ప్రచారాలకు ఆధారాలతో సమాధానం చెప్పేందుకు, శాఖ సాధిస్తున్న విజయాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పక్కా కమ్యూనికేషన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని, సూచించడం ద్వారా అటవీ శాఖను ఆధునిక సాంకేతిక, ప్రచార పంథాలోకి డిప్యూటీ సీఎం నడిపిస్తున్నారు.

ముగింపు: అడవుల రక్షణ అంటే కేవలం కొద్దిమంది అధికారుల విధి కాదు, అది ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు. లక్ష్మణ రేఖ దాటిన ఆక్రమణదారులపై కఠినంగా ఉంటూ, సాంకేతికతను జోడించి, ప్రజలను భాగస్వామ్యులను చేసినప్పుడే పవన్ కళ్యాణ్ ఆశించిన “హరిత ఆంధ్రప్రదేశ్” కల సాకారమవుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంకల్పంతో, అటవీ శాఖ ఇకనైనా నిద్ర మత్తు వదిలి, క్రియాశీలకంగా కదలాల్సిన సమయం ఆసన్నమైంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.