ఆంధ్ర ప్రదేశ్

ప్రతి రూపాయి గ్రామాభివృద్ధికే: పవన్ కళ్యాణ్

Published by
Srinivas

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను సమీక్షించారు. ఆయన నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో, గ్రామీణాభివృద్ధి ప్రాధాన్యతను ప్రతిబింబించే నిర్ణయాలు తీసుకున్నారు.

భారతదేశానికి పట్టుగొమ్మలు పల్లెలే, గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా సామాజికంగా బలోపేతమైనప్పుడే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సత్యాన్ని గ్రహించి, ఆంధ్రప్రదేశ్ పల్లెల రూపురేఖలను మార్చడమే ధ్యేయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇటీవల తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో ఆయన నిర్వహించిన సమీక్షా సమావేశం… కేవలం ఒక అధికారిక సమీక్ష మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే ఒక స్పష్టమైన వ్యూహాత్మక ప్రణాళిక.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు, ఉపాధి హామీ పనులకు వేసవి కాలం ఎంతో అనుకూలమైన సమయం. వర్షాల ప్రభావం లేకపోవడం వల్ల సీసీ రోడ్ల నిర్మాణం, మట్టి పనులు, చెరువుల పూడికతీత వంటివి వేగంగా పూర్తి చేసేందుకు వీలుంటుంది. ఈ కీలక సమయాన్ని వృథా చేయకుండా, పనుల వేగాన్ని పెంచాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం ఆయన పరిపాలనా దక్షతకు, సమయస్ఫూర్తికి నిదర్శనం. “కాలం కలిసివచ్చినప్పుడే కార్యాన్ని సాధించాలి” అనే విధంగా , ఈ వేసవిలోనే అత్యధిక శాతం పనులను పూర్తి చేయాలనే డిప్యూటీ సీఎం సంకల్పం సదా ప్రశంసనీయం.

ఈ సమీక్షలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ సరికొత్త మార్గదర్శకాలతో కూడిన “ఉపాధి హామీ” అనుసంధాన కార్యక్రమం (VB-G RAM G) మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “పల్లె పండుగ” పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. “పల్లె పండుగ” కింద గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం, మురుగునీటి పారుదలకు “మ్యాజిక్ డ్రైన్లు”, పశువుల సంరక్షణకు “గోకులాలు”, భూగర్భ జలాల పెంపునకు “ఫార్మ్ ఫాండ్స్” (పంట సంజీవని) వంటి ఎన్నో బహుళార్ధ సాధక పనులు జరుగుతున్నాయి.

ఈ పనులన్నీ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, ఏ ఏ పనులు ఏ దశలో (In-progress, estimation, or completion) ఉన్నాయో మ్యాపులు, నివేదికల ద్వారా తెప్పించుకుని, అధికారులను వివరించి చెప్పమని అడగటం తో…. ఆయనలో ప్రతిదీ తెలుసుకోవాలనే ఆసక్తి అర్ధం అవుతుంది. దీని వల్ల వ్యవస్థలో పారదర్శకత కోసం ఆయన పడుతున్న తపన అర్ధం అవుతుంది.

గతంలో గ్రామీణాభివృద్ధి నిధుల మళ్లింపు, పనుల్లో జాప్యం, బిల్లుల చెల్లింపుల్లో అలసత్వం వంటి కారణాల వల్ల గ్రామీణ వ్యవస్థ కుంటుపడింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం నిధుల సద్వినియోగంపై, ముఖ్యంగా కేంద్ర-రాష్ట్ర నిధుల బడ్జెట్ పరిమితులపై కఠినంగా వ్యవహరిస్తోంది. వేగంతో పాటు నాణ్యత (Quality) లో ఎక్కడా రాజీ పడకూడదని డిప్యూటీ సీఎం స్పష్టం చేయడం ద్వారా.. నిర్మించే ప్రతి రోడ్డు, ప్రతి మౌలిక వసతి దీర్ఘకాలం మన్నేలా ఉండాలనే లక్ష్యం కనిపిస్తోంది.

“అధికార యంత్రాంగం కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా, నిరంతరం క్షేత్రస్థాయి పర్యవేక్షణ (Ground-level monitoring) చేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి.”

ముగింపు: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతర సమీక్షలు, పర్యవేక్షణల వల్ల అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో నిజమైన అభివృద్ధి జరగాలని, ప్రతి రూపాయి నేరుగా గ్రామాభివృద్ధి కే ఖర్చు కావాలనే వారి విధానం పల్లెల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. వేసవి కార్యాచరణను ఇంజనీరింగ్ అధికారులు సవాల్‌గా తీసుకుని, నిర్దేశిత గడువులోగా “పల్లె పండుగ” లక్ష్యాలను పూర్తి చేసినప్పుడే.. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలు స్వయంసమృద్ధిని సాధించి, నిజమైన పల్లె ప్రగతి కి వేదికలుగా మారుతాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.