
మాటకు ప్రాణం వస్తే పవన్ కళ్యాణ్…. నమ్మకానికి నిలువెత్తు రూపం ఉంటే పవన్ కళ్యాణ్” అని గంగ పుత్రులు సోషల్ మీడియా వేదికగా జనసేనానిని, కూటమి ప్రభుత్వం ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మత్స్యకార సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. “మాటలు కోటలు దాటతాయి…. చేతలు గడప దాటవు” కొందరు నాయకులను ఈ విధంగా వ్యాఖ్యానిస్తుంటారు. కాని కూటమి నేతలు రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లను అధిగమించి మరీ మత్స్యకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” ప్రకటించినట్లుగా… వరుసగా రెండో ఏడాది కూడా “మత్స్యకార సేవలో” పథకం నిధులను విజయవంతంగా విడుదల చేయడం, తీరప్రాంత మత్స్యకార, వెనుకబడిన వర్గాల గుండెల్లో నమ్మకాన్ని నింపింది. సముద్రం లో చేపల వేట నిషేధ కాలంలో ఆకలి కేకలు వినబడకూడదనే సంకల్పంతో తీసుకున్న ఈ నిర్ణయం మత్స్యకార కుటుంబాలకు ఆసరా గా మారింది.
గత ప్రభుత్వ హయాంలో వేట నిషేధ భృతి కేవలం రూ. 10 వేలు మాత్రమే ఉండేది. కానీ, ఎన్నికల వేళ మత్స్యకారుల కష్టాలను కళ్లారా చూసిన కూటమి ప్రభుత్వం… ఆ మొత్తాన్ని ఏకంగా రెట్టింపు చేసి రూ. 20 వేల రూపాయల కు పెంచింది. పెంచిన హామీని నిలబెట్టుకుంటూ, ఎక్కడా దళారుల ప్రమేయం లేకుండా, లబ్ధిదారులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ఈ రూ. 20 వేల ఆర్థిక సాయాన్ని జమ చేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.30 లక్షల మంది మత్స్యకారులకు దీని ద్వారా లబ్ధి చేకూరుతోంది. కేవలం ఈ ఒక్క పథకం కోసమే ప్రభుత్వం రూ. 262 కోట్లు వ్యయం చేయడమే మత్స్యకారుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న, చిత్తశుద్ధిని, నిబద్ధతను చాటి చెబుతోంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో 24,930 మంది లబ్ధిదారులకు రూ. 49.86 కోట్ల మేర, పిఠాపురం నియోజకవర్గంలో 6,897 మంది లబ్ధిదారులకు రూ. 13.79 కోట్ల మేర ఆర్థిక ఊరట లభించింది.
“అలల మీద బతికే వాడికి… ఆకలి కేకలు కొత్త కాదు… కాని ఆదుకునే చేయి ఉంటే తుపానును కూడా లెక్కచేయడు గంగ పుత్రుడు” అని అంటారు. పొట్టకూటి కోసం కన్న ఊరిని, కట్టుకున్న భార్యాపిల్లలను వదిలి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లే మత్స్యకారుల వలసలను అరికట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాకినాడ జిల్లాలోని 119 కిలోమీటర్ల కోస్తా తీర పరిధిలో ఉన్న 23 ల్యాండింగ్ సెంటర్లు, 51 మత్స్యకార గ్రామాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నారు.
మత్స్యకారుడికి వేట భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం, 4,578 బోట్లకు గాను, 91.48 లక్షల లీటర్ల డీజిల్ ను రూ. 8.23 కోట్ల రూపాయల తో సబ్సిడీ ఇచ్చి వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, మరియు DRDA (District Rural Development Agency) జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (గ్రామీణ ప్రాంతాల్లో సబ్సిడీలు, రుణాలు ఇప్పించి స్వయం ఉపాధి కల్పించే ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ) సహకారంతో ఇంజన్లు, వలలు, బోట్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు రూ. 1.13 కోట్ల రూపాయల సబ్సిడీ అందజేసి, స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నారు. కోనపాపపేట గ్రామంలో మత్స్యకారుల సామాజిక అవసరాల కోసం రూ. 2 కోట్ల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపట్టారు.
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై ఉచితంగా ‘ట్రాన్స్ పాండర్స్’ (Transponders) ఇస్తోంది. సాధారణంగా మొబైల్ సిగ్నల్స్ పని చేయవు సముద్రంలో….. అందువల్ల ఈ “ట్రాన్స్ ఫాండర్స్” ఉపగ్రహం (శాటిలైట్) ద్వారా తీరంలో ఉండే కంట్రోల్ రూమ్‌కు నిరంతరం సిగ్నల్స్ పంపే అద్భుత సాంకేతిక పరికరం ఇది. ఒకవేళ సముద్రంలో తుపాను వచ్చినా, లేదా బోటు ప్రమాదానికి గురైనా… మత్స్యకారులు ఎక్కడున్నారో ఖచ్చితమైన లొకేషన్ గుర్తించి, రెస్క్యూ టీమ్స్‌ను పంపి ప్రాణాలు కాపాడటానికి ఇది ఒక సంజీవనిలా పనిచేస్తుంది. అలాగే, సముద్రంలో జీవవైవిధ్యాన్ని, చేపల సంఖ్యను పెంచడానికి జిల్లాలో 20 స్థలాలను ఎంపిక చేసి, ఒక్కో చోట రూ. 20 లక్షల వ్యయంతో ఆర్టిఫిషియల్ రీప్స్ (కృత్రిమ చేపల ఆవాస వలయాలు) ఏర్పాటు చేస్తున్నారు.
అటు పర్యావరణాన్ని, సముద్ర తాబేళ్లను రక్షించేందుకు వీలుగా అన్ని ట్రాలింగ్ బోట్లకు ఉచితంగా “టెడ్” (TED – Turtle Excluder Device) పరికరాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. పెద్ద పెద్ద వలల్లో అరుదైన సముద్ర తాబేళ్లు చిక్కుకుని చనిపోకుండా, కేవలం చేపలు మాత్రమే వలలో పడి, తాబేళ్లు సురక్షితంగా బయటకు వెళ్ళిపోయేలా చేసే ప్రత్యేక “మెటల్ గ్రిల్” పరికరమే ఈ “టెడ్”. దీనివల్ల మత్స్యకారుల వేటకు నష్టం కలగదు, అటు సముద్ర పర్యావరణానికి కీలకమైన తాబేళ్ల ప్రాణాలు కూడా కాపాడబడతాయి. ఇది పర్యావరణం పట్ల ప్రభుత్వానికి ఉన్న దూరదృష్టికి అద్దం పడుతోంది.
ముగింపు: ఏపీ ముఖ్యమంత్రి “నారా చంద్రబాబు నాయుడు” సమర్థ నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం నడుస్తోంది. “మాట తప్పనివాడే నిజమైన నాయకుడు” అనే సూత్రం ప్రకారం… ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా, ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తూ సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేరుస్తున్నారు. తీరప్రాంతాల్లోనే మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించి, మత్స్యకారుల వలసలను పూర్తిగా తగ్గించడమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణం.. రేపటి రోజున మత్స్యకారుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపడం ఖాయం.
