ఆంధ్ర ప్రదేశ్

సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట.. అసైన్డ్ భూముల కేసు కొట్టివేత

Published by
Rahul N

అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో కీలక ఊరట లభించింది. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. దాన్ని కొట్టివేసింది. ఈ కేసును పూర్తిగా రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

ఏపీ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం గానీ, అందుకు తగిన కారణాలు గానీ కనిపించడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారంలో చంద్రబాబు, నారాయణపై కొనసాగుతున్న కేసుకు తెరపడింది.

హైకోర్టు వ్యాఖ్యలతో సుప్రీం ఏకీభవింపు

ఈ కేసు రాజకీయ కక్షసాధింపుతో నమోదైందన్న ఏపీ హైకోర్టు అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. రాజధాని ల్యాండ్‌ పూలింగ్‌, ప్రభుత్వ ఉత్తర్వుల జారీ వంటి అంశాలు ప్రభుత్వ పరిపాలనలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలని ధర్మాసనం పేర్కొంది.

అంతేకాకుండా.. ఈ వ్యవహారంలో నేరుగా నష్టపోయిన వ్యక్తులు ఎవరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించని నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లకు చట్టపరమైన ప్రాతిపదిక లేదన్న హైకోర్టు అభిప్రాయంతో సుప్రీంకోర్టు ఏకీభవించింది.

రాజకీయ కక్షలకు కోర్టులు వేదిక కాకూడదు

న్యాయస్థానాలను రాజకీయ కక్షసాధింపులకు వేదికగా మార్చకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ ప్రత్యర్థుల మధ్య వివాదాలను క్రిమినల్ కేసుల రూపంలో కోర్టుల ముందుకు తీసుకురావడంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించిన విచారణను కూడా సుప్రీంకోర్టు ముగించింది. దీంతో అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు, నారాయణకు న్యాయపరంగా ఊరట లభించినట్లయింది.

Rahul N

Recent Posts