వార్తలు

ప్రియాంక కుటుంబానికి జీఎస్ఎల్ కాలేజీ అండ.. రూ.20 లక్షల సాయం

Published by
Rahul N

రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడంతో తీవ్ర విషాదంలో ఉన్న ఆమె కుటుంబానికి రాజమండ్రి జీఎస్ఎల్ వైద్య కళాశాల యాజమాన్యం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి తమ మానవత్వాన్ని చాటుకుంది.

జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్ల్‌సపూర్‌లోని ప్రియాంక ఇంటికి కళాశాల యజమాని కుమారుడు తరుణ్‌, ఆయన భార్య సాధ్విక, ప్రిన్సిపాల్‌ సుభాషిణి బుధవారం వెళ్లారు. ప్రియాంక తండ్రి వెంకటేశ్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం కళాశాల తరఫున రూ.20 లక్షల చెక్కును వెంకటేశ్‌కు అందజేశారు.

ఇదే సమయంలో ప్రియాంక విద్యాభ్యాసానికి సంబంధించి ఇప్పటివరకు కళాశాలకు చెల్లించిన ఫీజు మొత్తాన్ని కూడా తిరిగి చెల్లిస్తామని యాజమాన్యం తెలిపింది. కుటుంబానికి అవసరమైన సమయంలో తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేసింది.

ఇక ప్రియాంక కుటుంబాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రియాంక తండ్రి వెంకటేశ్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. కుటుంబానికి పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. అవసరమైన న్యాయపరమైన సహాయం బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ద్వారా అందిస్తామని భరోసా కల్పించారు.

ఒకవైపు కుమార్తెను కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచిన జీఎస్ఎల్‌ వైద్య కళాశాల యాజమాన్యం.. మరోవైపు న్యాయపరమైన సహాయం అందిస్తామని కేటీఆర్‌ హామీ ఇవ్వడం బాధిత కుటుంబానికి కొంత ఊరటనిచ్చింది.

Rahul N

Recent Posts