రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు మొదలైంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది.
ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే 8 పట్టణ స్థానిక సంస్థల్లో చైర్పర్సన్లు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో అక్కడ పోలింగ్ అవసరం లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కలిపి మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) పక్కా ఏర్పాట్లు చేసింది. మొత్తం 11,705 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 99,36,014 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు.
మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీల్లో ఆసక్తి నెలకొంది. పట్టణ ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ ముగిసిన అనంతరం మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.