సినిమా వార్తలు

రంగస్థలం కాంబో మళ్లీ రిపీట్.. రామ్ చరణ్ – సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్!

Published by
Srinivas

మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలిసి చేయబోతున్న కొత్త సినిమాకు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.

ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. నిర్మాత దిల్ రాజుతో కలిసి చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు. మరోవైపు టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కార్యక్రమానికి హాజరైన పలువురు దర్శకులు తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు.

నిజానికి రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ‘రంగస్థలం’. ఆ సినిమాతో వీరిద్దరూ సృష్టించిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. చిట్టిబాబు పాత్రలో చరణ్ నటన, సుకుమార్ కథన శైలి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే కాంబో మరోసారి జతకట్టడంతో ఈ కొత్త సినిమాపై అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.

ఈసారి రామ్ చరణ్‌ను సుకుమార్ పూర్తిగా భిన్నమైన పాత్రలో చూపించబోతున్నారు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని సరికొత్త అవతార్‌లో చరణ్ కనిపించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమాలో ఆయన లుక్ ఎలా ఉండబోతోంది? సుకుమార్ ఎలాంటి కథను సిద్ధం చేశారు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, విజయ ప్రసాద్ బండ్రెడ్డి, భూషణ్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. నీలం, ఆకుపచ్చ, బంగారు రంగులతో రూపొందించిన నెమలి ఈకలో రామ్ చరణ్ ముఖాన్ని సృజనాత్మకంగా మిళితం చేశారు. ‘యు కెన్ ఇమాజిన్’ అనే క్యాప్షన్‌తో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని మరింత పెంచారు.

ప్రస్తుతం ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ వెల్లడించలేదు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. మొత్తానికి ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కలిసి చేస్తున్న ఈ సినిమా టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts