
పులివెందుల రాజకీయాల్లో ఈసారి ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా పేరున్న పులివెందులలో తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని టీడీపీ చెబుతోంది. గతంలో ఏకపక్షంగా సాగిన రాజకీయాలకు ఈసారి అడ్డుకట్ట పడుతోందని, దీంతో వైసీపీ నేతలు అసహనంతో వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే వైసీపీ వివాదాలకు తెరతీసిందని టీడీపీ విమర్శిస్తోంది. పోటీలో నిలిచేందుకు సొంత పార్టీ నేతలు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో జగన్ స్వయంగా పులివెందులకు వస్తున్నానంటూ క్యాడర్‌ను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారని ఆరోపించింది.
అంతేకాకుండా ‘చొక్కాలు మడతపెడతా’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఉన్నాయని టీడీపీ మండిపడుతోంది. ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే తమ రాజకీయ ఆధిపత్యానికి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే వైసీపీ శ్రేణులు వివాదాలు సృష్టిస్తున్నాయని విమర్శిస్తోంది.
పులివెందులలో రౌడీ రాజకీయాలకు కాలం చెల్లుతోందని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఏర్పడుతోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి వస్తున్న ఆరోపణలు, విమర్శలను వారు తిప్పికొడుతున్నారు.
మొత్తంగా పులివెందుల ఎన్నికలు స్థానిక సంస్థల పోరును మించి రాజకీయ ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా మారాయి. ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
