ముస్తాబు కార్యక్రమం తనను ఎంతో ఆకర్షించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యంగా మన్యం జిల్లాలో విద్యార్థులే ముందుకొచ్చి “ముస్తాబు కార్యక్రమం చాలా బాగుంది” అని చెప్పే స్థాయికి ఇది చేరుకోవడం ఆనందకరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పిల్లల ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చేలా ఉందని, భవిష్యత్ తరాలకు మంచి అలవాట్లు అలవర్చే శక్తి దీనిలో ఉందని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 79 లక్షల మంది విద్యార్థులకు చేరేలా ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులకు చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెడితే చిన్నారులకు పరిశుభ్రత, క్రమశిక్షణ వంటి విలువలు సహజంగా అలవడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
పిల్లల్లో అలవాటుగా మారిన మంచి ఆచరణలు వారి ఇళ్ల పరిసరాలకూ విస్తరించి, గ్రామాలు–పట్టణాలు మరింత పరిశుభ్రంగా మారే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు. విద్యా వ్యవస్థ ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, ముస్తాబు వంటి కార్యక్రమాలు ఆ దిశగా కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
కలెక్టర్ల సదస్సు సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి, ప్రతి విద్యార్థి జీవితంలో భాగం చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.