తెలంగాణ

హరీష్ రావు ఫైర్: “కాంగ్రెస్ ప్రభుత్వం దండుపాళ్యం ముఠాలా మారింది”

Published by
Srinivas

తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుమ్మెత్తిపోశారు. కాబినెట్ నుండి పెట్టుబడుల దాకా… ప్రతీ అంశంపై ఘాటు విమర్శలు గుప్పించారు.

కేబినెట్ దండుపాళ్యం ముఠా లా మారింది

హరీష్ రావు మాట్లాడుతూ, “ఇవాళ కేబినెట్ మీటింగ్ దండుపాళ్యం ముఠా లా మారింది. మంత్రులు పంచాయితీలు తెంపుకోడానికి మీటింగులు పెడుతున్నారు. కమిషన్ల కోసం ఒకరు, కాంట్రాక్టుల కోసం ఒకరు, వాటాల కోసం ఒకరు, అక్రమ వసూళ్ల కోసం, కబ్జాల కోసం ఒకరు అంటూ వర్గాలుగా విడిపోయారు” అని తీవ్రంగా విమర్శించారు.

రేవంత్ రెడ్డి తెలంగాణలోకి గన్ కల్చర్ తీసుకొచ్చాడు

హరీష్ రావు రేవంత్ రెడ్డి శైలిపై కూడా మండిపడ్డారు. “టెక్ మహేంద్ర సీఈఓ వచ్చినప్పుడు వర్షం పడుతుంటే తానే గొడుగు పట్టి వ్యాపారవేత్తలను ఆహ్వానించిన సంస్కృతి మాది. కానీ ఇప్పుడు తుపాకులు పెట్టి వసూళ్లు చేస్తున్న సంస్కృతి మీది. ఇదే కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు తగ్గిపోయాయి. పెట్టుబడిదారులు భయపడుతున్నారు” అని వ్యాఖ్యానించారు.

విజయోత్సవాలు దేని కోసం?

కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలపై కూడా హరీష్ రావు ప్రశ్నలు వేశారు. “ఏం విజయోత్సవాలు నాయనా? తుపాకులు పెట్టి వసూళ్లు చేసినందుకా? క్యాబినెట్‌లో కొట్లాటలకి దిగినందుకా? మంత్రుల మధ్య తగాదాలు జరుగుతున్నందుకా? ఈ 23 నెలల పాలనలో ఏమి సాధించారు?” అని ప్రశ్నించారు.

ప్రజలతో బీఆర్ఎస్ ఎప్పుడూ ఉంటుంది

చివరగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, సినిమా ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పేదలకు హామీ ఇస్తూ… “ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకురండి. మేము అండగా ఉంటాము. మీ కోసం తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి” అని హరీష్ రావు చెప్పారు.

Srinivas