తెలంగాణ

ఢిల్లీ లిక్కర్ కేసు తీర్పు: రాజకీయ కక్ష సాధింపా…? లేక దర్యాప్తు లో లోపాలా…?

Published by
Suresh Thota

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దేశ రాజకీయాల్లో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో అరెస్టయిన ప్రముఖుల్లో అరవింద్ కేజ్రీవాల్ , మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత ఉన్నారు. దర్యాప్తు సంస్థ సీబీఐ మరియు ఈడీ చర్యలపై రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తగా, ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పులు మరింత చర్చకు దారితీశాయి.

అరవింద్ కేజ్రీవాల్… 2024 మార్చిలో అరెస్టయ్యారు. సుమారు 50 రోజుల వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంలో తాత్కాలిక బెయిల్, అనంతరం సాధారణ బెయిల్ లభించింది. ముఖ్యమంత్రిగా పదవిలో ఉండగానే అరెస్టు కావడం దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ చర్చకు దారి తీసింది.

మనీష్ సిసోడియా… 2023 ఫిబ్రవరిలో అరెస్టయ్యారు. ఆయన సుమారు 17 నెలలపాటు (దాదాపు 500 రోజులకుపైగా) జైలులో ఉన్నారు. ఈ కాలంలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీర్ఘకాలం జైలు జీవితం అనుభవించిన ప్రముఖుల్లో సిసోడియా ఒకరు.

కల్వకుంట్ల కవిత… 2024లో అరెస్టయ్యారు. సుమారు గా 6 నెలలపాటు జైలు లో ఉన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కావడం, తెలంగాణలో ప్రముఖ రాజకీయ నాయకురాలు కావడంతో , ఆమె అరెస్టు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది.

రౌస్ అవెన్యూ కోర్టు విచారణలో చార్జిషీట్లలో సాక్ష్యాధారాల బలంపై ప్రశ్నలు లేవనెత్తినట్లుగా సమాచారం. కొందరికి ఊరట లభించడంతో, ఈ లిక్కర్ కేసుల్లో మెరిట్ ఉందా” అనే చర్చ మొదలైంది. అయితే ఇది పూర్తిస్థాయి తీర్పా? లేక ప్రాథమిక సాక్ష్యాల సమర్పణలో ఉదాసీనత పై వ్యాఖ్యనా ? అన్నది న్యాయ ప్రక్రియలో ముందు ముందు స్పష్టమవుతుంది.

ఈ కేసు మొదటి నుంచి రాజకీయ కక్షసాధింపుగా నమోదైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై వేళ్లు చూపిస్తున్నాయి.

“విపక్ష నేతలపై కేసులు – అరెస్టులు – తరువాత బెయిళ్ళు” అనే పరిణామ క్రమం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది.

ఇంకా కొందరు విశ్లేషకుల వాదన ప్రకారం…. దర్యాప్తు ప్రమాణాల్లో లోపాలా ? చార్జిషీట్లలో తగిన ఆధారాల లోపమా ? లేక రాజకీయ ఒత్తిడితో కూడిన ఆరోపణలేనా ? అన్న ప్రశ్నలు నిలుస్తున్నాయి.

ప్రజాస్వామ్యంపై ప్రభావం…… పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అరెస్టు కావడం, మాజీ ఉప ముఖ్యమంత్రి దీర్ఘకాలం జైలులో ఉండటం, ప్రముఖ నేతలపై కేసులు నమోదవడం …… ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థపై పెద్ద చర్చకు దారితీశాయి.

“చట్టం తన పని తాను చేసుకుంటుంది” అనే ప్రభుత్వ వాదన ఒకవైపు ఉంటే, “దర్యాప్తు సంస్థల స్వతంత్రత” మరోవైపు ప్రశ్నార్థకంగా మారింది.

ముగింపు

ఢిల్లీ లిక్కర్ కేసు కేవలం ఒక అవినీతి కేసుగా మాత్రమే కాకుండా, దర్యాప్తు సంస్థల విశ్వసనీయత, రాజకీయ వ్యవస్థ పారదర్శకత, ప్రజాస్వామ్య నమ్మకం వంటి అంశాలను కేంద్రంగా చేసుకుని సాగుతున్న పెద్ద రాజకీయ పోరాటంగా మారింది.

జైలు జీవితం గడిపిన ఈ ముగ్గురు నేతలకు కోర్టు దశలవారీగా ఊరట లభించిన నేపథ్యంలో “కేసుల్లో నిజమెంత….? రాజకీయమేమిటి….?” అనే ప్రశ్నకు తుది సమాధానం న్యాయవ్యవస్థలోని పూర్తి విచారణ తరువాతే వెలువడనుంది.

ఏది ఏమైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పై ఉంది…. దీన్ని రక్షించుకోవాలి అంటే ప్రశ్నించాలి…. మనకెందుకు అనుకుంటే… ఇంకెన్ని తప్పుడు కేసులు చూడవలసి వస్తుందో….

Suresh Thota