భారత సైన్యం సారథి గా “ధీరజ్ సేథ్” నియమితులయ్యారు. దేశ రక్షణ రంగంలో అత్యంత వ్యూహాత్మక మార్పులు, ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో…. భారత సైన్యానికి వైస్ చీఫ్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ “ధీరజ్ సేథ్” నూతన ఆర్మీ చీఫ్‌గా (Chief of Army Staff) బాధ్యతలు స్వీకరించారు. జూన్ 30న జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ చేయడంతో, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ధీరజ్ సేథ్ దేశ రక్షణ పగ్గాలను చేపట్టారు. ఆయన ఈ పదవిలో ఆగస్టు 31, 2028 వరకు కొనసాగనున్నారు. సుమారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సైనిక అనుభవం, సరిహద్దు రక్షణపై అపారమైన పట్టు ఉన్న “ధీరజ్ సేథ్” నియామకం …. మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ (Geopolitical) పరిస్థితుల రీత్యా భారత్‌కు అత్యంత కీలకం కానుంది.
వారసత్వం నుండి సారథ్యం వైపు…
నూతన ఆర్మీ చీఫ్ “ధీరజ్ సేథ్” నియామకంలో అత్యంత ఆసక్తికరమైన అంశం వారి కుటుంబ సైనిక నేపథ్యం. దేశ రక్షణ, దేశ సేవనే శ్వాసగా బతికే సైనిక కుటుంబం నుండి ఆయన ఈ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ఆయన తండ్రి లెఫ్టినెంట్ జనరల్ “కృష్ణ మోహన్ సేథ్” (KM Seth) కూడా ఆర్మీలో త్రీ-స్టార్ జనరల్‌గా విశిష్ట సేవలు అందించారు. గతంలో తండ్రి నేతృత్వం వహించిన భోపాల్‌లోని ప్రతిష్టాత్మక “సుదర్శన్ చక్ర కోర్ప్స్” (21 కోర్ప్స్) కు తదనంతర కాలంలో కొడుకు “ధీరజ్ సేథ్” కూడా కమాండర్‌గా వ్యవహరించడం సైనిక చరిత్రలోనే ఒక అరుదైన, గర్వకారణమైన ఘట్టం. ఇక ఆయన సోదరుడు “రవ్నీష్ సేథ్” సైతం భారత నౌకాదళం (Indian Navy) లో రియర్ అడ్మిరల్‌గా సేవలందిస్తుండటం చూస్తే.. ఈ కుటుంబం దేశ రక్షణనే పరమావధిగా, ఏ స్థాయిలో అంకితమైందో అర్థం చేసుకోవచ్చు.
మూడు దశాబ్దాల తర్వాత….
భారత సైన్యంలో అత్యంత శక్తివంతమైన ట్యాంకుల విభాగంగా పేరొందిన “ఆర్మర్డ్ కార్ప్స్” (2nd Lancers) నుండి ధీరజ్ సేథ్ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1986లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) నుండి ఉత్తీర్ణులై ఎంపిక అయ్యారు. దాదాపుగా గడిచిన ముప్పై ఏళ్లలో ఈ విభాగం నుండి ఆర్మీ చీఫ్ గా ఎవరూ ఎంపిక కాలేదు. ఈ హోదాకు ఎదిగిన అధికారి గా ఈయన రికార్డు సృష్టించారు. చివరగా 1997లో జనరల్ “శంకర్ రాయ్ చౌదరి”….. “ఆర్మర్డ్ కార్ప్స్” నుండి ఆర్మీ చీఫ్ కాగా, మళ్లీ ఇన్నాళ్లకు “ధీరజ్ సేథ్” రూపంలో ఆ విభాగానికి ఈ అత్యున్నత గౌరవం దక్కింది.
అపారమైన వ్యూహాత్మక అనుభవం…
“ధీరజ్ సేథ్” కెరీర్ గ్రాఫ్ చూస్తే ఆయన దేశంలోని దాదాపు అన్ని రకాల క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులలో పనిచేశారు. ఎడారి ప్రాంతంలో ఆర్మర్డ్ రెజిమెంట్‌ను నడిపించిన వ్యూహాత్మక చతురత, పశ్చిమ సరిహద్దుల్లో ఆర్మర్డ్ బ్రిగేడ్‌ను నడిపిన అనుభవం, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక విభాగానికి (Counter-Insurgency Force) నేతృత్వం వహించిన క్షేత్రస్థాయి ప్రతిభ ఆయన సొంతం. సైన్యంలో చాలా అరుదుగా.. పాకిస్తాన్ సరిహద్దులను పర్యవేక్షించే రెండు కీలక కమాండ్లకు (సౌత్ వెస్ట్రన్ కమాండ్ మరియు సదరన్ కమాండ్) జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా వ్యవహరించడం ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం. అటు క్షేత్రస్థాయి కమాండర్‌గా, ఇటు సైన్యానికి వైస్ చీఫ్‌గా పనిచేసిన అనుభవం ఇప్పుడు ఆయనకు ఉపయోగపడనుంది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం….
భవిష్యత్తు యుద్ధాలు కేవలం సంప్రదాయ ఆయుధాలతోనే కాకుండా, డ్రోన్లు, సైబర్ విజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో ముడిపడి ఉంటాయని ధీరజ్ సేథ్ గట్టిగా విశ్వసిస్తారు. ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో స్ట్రాటజిక్ ప్లానింగ్, కేపబిలిటీ డెవలప్‌మెంట్ విభాగాల్లో పనిచేస్తూ.. భారత సైన్యాన్ని సరికొత్త సాంకేతికతతో బలోపేతం చేయడంలో (Force Modernisation) ఆయన కీలక ప్రణాళికలు రచించారు. దీనికి తోడు ఆయన విద్యా నేపథ్యం, అంతర్జాతీయ అనుభవం అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్నవి. డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో “బెస్ట్ ఆల్ రౌండ్ స్టూడెంట్ ఆఫీసర్” మెడల్ సాధించిన ఆయన, ఫ్రాన్స్ (ప్యారిస్) లోని “కమాండ్ అండ్ స్టాఫ్ కోర్సు”, అమెరికాలో “డిఫెన్స్ అక్విజిషన్ మేనేజ్‌మెంట్” కోర్సులు పూర్తి చేసి గ్లోబల్ మిలిటరీ ట్రెండ్స్‌పై పట్టు సాధించారు. 1995 నుండి 1996 మధ్య కాలంలో, అంగోలా నందు జరిగిన ఐక్యరాజ్యసమితి (UN) శాంతిభద్రతల మిషన్‌లో ఆపరేషన్స్ ఆఫీసర్‌గా పనిచేసి అంతర్జాతీయ దౌత్య, సైనిక వ్యూహాలను కూడా ఆకళింపు చేసుకున్నారు.
సవాళ్లు – సన్నద్ధత
ఆయన దేశానికి చేసిన విశిష్ట సేవలకు గానూ ప్రభుత్వం ఇప్పటికే పరమ విశిష్ట సేవా మెడల్ (PVSM), ఉత్తమ యుద్ధ సేవా మెడల్ (UYSM), మరియు అతి విశిష్ట సేవా మెడల్ (AVSM) లతో సత్కరించింది. ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, చైనా,పాక్ మరియు బంగ్లాదేశ్ నుండి ఎదురవుతున్న ప్రత్యక్ష, పరోక్ష సవాళ్లు, హిందూ మహాసముద్ర ప్రాంతంలో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో.. నూతన ఆర్మీ చీఫ్ గా “ధీరజ్ సేథ్” ముందు అనేక సవాళ్లు ఉన్నాయి.
ముగింపు: ముఖ్యంగా ముగ్గురు సైనిక దళాల సమన్వయానికి ఉద్దేశించిన “థియేటర్ కమాండ్ల ఏర్పాటు”, స్వదేశీ ఆయుధాల తయారీ మరియు సాంకేతిక సైనిక ఆధునీకరణలను ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు దేశ రక్షణ రంగంలో ఆసక్తికరంగా మారింది. అపారమైన అనుభవం, సునిశితమైన వ్యూహాత్మక ఆలోచనలు కలిగిన “ధీరజ్ సేథ్” నాయకత్వంలో భారత సైన్యం మరింత పటిష్టంగా, అత్యాధునికంగా ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.