తెలంగాణ నది జలాల హక్కులను కాపాడడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. జల సమస్యలపై చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు అహంకారంతో మాట్లాడుతున్నారని, ప్రజల సమస్యలపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
పాలమూరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి సొంత జిల్లాకే అన్యాయం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో స్పష్టమైన వైఖరి లేకుండా దగుల్బాజీ మాటలు మాట్లాడటం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వాగుడు, ప్రవర్తనకు సభ్యత, సంస్కారం లేదని విమర్శిస్తూ, ప్రజలు ఇప్పటికే దీనిని గమనించి తిరస్కరిస్తున్నారని చెప్పారు.
శాసనసభలోనే కాకుండా ప్రజాసభల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జలద్రోహ విధానాలను నిరంతరం ఎండగడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. నది జలాల అంశంలో తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి కేంద్రం ముందు తలవంచుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.
2028 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెబుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేసే తీర్పు ప్రజలు ఇస్తారని వ్యాఖ్యానించారు. జలహక్కుల పరిరక్షణే లక్ష్యంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు.