ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన అభిమానుల పట్ల ఉన్న ప్రేమ, బాధ్యతను చాటుకున్నారు. సినిమాలతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న ఆయన, ఇప్పుడు వారి సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. AAFA (Allu Arjun Fans Association) వార్షిక సదస్సు-2026 వేదికగా అభిమానులందరికీ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం అభిమానుల్లో ఆనందాన్ని నింపడంతో పాటు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రశంసలు అందుకుంటోంది.
ఈ ఏడాది నిర్వహించిన AAFA వార్షిక సదస్సుకు దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి వెయ్యికి పైగా అభిమానులు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఫ్యాన్స్ ప్రతినిధులతో ఈ సమావేశం ఎంతో ఘనంగా జరిగింది.
ఈ సమావేశంలో అల్లు అర్జున్ AAFA సభ్యులందరికీ ఇన్సూరెన్స్ కవరేజ్ అందించనున్నట్లు ప్రకటించారు. అభిమానుల భవిష్యత్తు భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం ఆయన అభిమానుల పట్ల చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలిచింది.
సాధారణంగా అభిమానుల సమావేశాలు వేడుకలకే పరిమితమవుతుంటే, అల్లు అర్జున్ మాత్రం దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషంగా మారింది.
సదస్సులో పాల్గొన్న ప్రతి అభిమానితో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కలుసుకున్నారు. దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల పాటు ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ సమయం కేటాయించారు. ప్రతి సభ్యుడికి ఆయనతో వ్యక్తిగతంగా ఫోటో దిగే అవకాశం కల్పించడం అభిమానులకు మరపురాని అనుభూతిగా మారింది.
అంతేకాకుండా సదస్సుకు హాజరైన అభిమానులందరికీ ప్రత్యేకంగా భోజన విందును కూడా ఏర్పాటు చేశారు.
సినిమా విజయాలు, రికార్డులు మాత్రమే కాదు… అభిమానుల సంక్షేమం కూడా తనకు సమానంగా ముఖ్యమని అల్లు అర్జున్ మరోసారి నిరూపించారు. అభిమానుల కోసం ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం ద్వారా, ఒకరోజు జరిగే వేడుక కంటే వారి భవిష్యత్తు భద్రతకే తాను ప్రాధాన్యం ఇస్తున్నానని స్పష్టమైన సందేశం ఇచ్చారు.
అభిమానులను కేవలం ఫ్యాన్స్‌గా కాకుండా కుటుంబ సభ్యుల్లా భావిస్తూ వారి సంక్షేమానికి చేయూతనివ్వడం వల్లే అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే, ఇటీవల అల్లు అర్జున్ తన కొత్త చిత్రం ‘రాకా’ను ప్రకటించి దేశవ్యాప్తంగా భారీ చర్చకు తెరతీశారు. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ కొత్త లుక్‌కు విశేష స్పందన లభించగా, ఆయన తదుపరి అప్‌డేట్స్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.