తాగునీటి విషయంలో పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజల అవసరాలకే ప్రాధాన్యం ఇస్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు, ప్రతి గ్రామానికి నీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా ‘అమరజీవి జలధార’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రూ.30,156 కోట్లతో భారీ తాగునీటి ప్రణాళికను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 3.27 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందించేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు.
పులివెందుల నియోజకవర్గంలోని తాగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు రూ.280 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టును చేపడుతున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. దీని ద్వారా 299 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని తాళ్లమాపురం ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి రూ.3.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్ పనులను పూర్తి చేయడంతో పాటు మౌలిక వసతులను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
2024తో ముగియాల్సిన జల్ జీవన్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం 2028 వరకు పొడిగించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.4,500 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని చెప్పారు. రాబోయే రోజుల్లో తాగునీటి మౌలిక వసతులపై మరింత భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు.
రాయలసీమ నుంచి ఉద్దానం వరకు తాగునీటి సమస్య ఉన్న ప్రతి ప్రాంతానికి ప్రాధాన్యం ఇస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా నిర్మించిన మౌలిక వసతులకు మించి రాబోయే ఐదేళ్లలో భారీ స్థాయిలో నీటి మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.
పులివెందుల తాగునీటి సరఫరా ప్రాజెక్టుపై కూడా పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో రూ.182 కోట్లు ఖర్చు చేసి 40 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో రూ.203 కోట్లు ఖర్చు చేసి పనులను 56 శాతానికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
ఈ అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చర్చకు సిద్ధమా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తాగునీటి వంటి మౌలిక అవసరాల విషయంలో రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పంచాయతీలకు రూ.4,200 కోట్ల నిధులు అందించామని పవన్ కల్యాణ్ తెలిపారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
“పార్టీ కాదు.. ప్రాంతం కాదు.. ప్రజలే ముఖ్యం. ప్రతి ఇంటికీ సురక్షిత నీరు.. ప్రతి గ్రామానికి నీటి భద్రత” అనే లక్ష్యంతో ‘అమరజీవి జలధార’ను ముందుకు తీసుకెళ్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.