‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన నిహారిక కొణిదెల.. ఇప్పుడు అదే చిత్రంతో జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ చిత్రం తెలుగులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా ఎంపిక కావడంతో పాటు, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ విభాగంలో పి. రవికుమార్ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ వేడుకలో నిహారిక చేసిన ప్రసంగం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది.
“నా 32 ఏళ్ల జీవితంలో ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మించాలనే నిర్ణయం తీసుకోవడమే నేను చేసిన గొప్ప పని” అంటూ నిహారిక తన మనసులోని మాటను పంచుకున్నారు. సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి ప్రయాణం తనకు తెలుసని, రెండు జాతీయ అవార్డులు రావడం చూసి తన హృదయం ఆనందంతో నిండిపోయిందని చెప్పారు.
మంచి కథను నమ్మి సినిమా నిర్మించానని, అది ప్రేక్షకుల హృదయాలకు చేరుకోవడమే తనకు పెద్ద విజయమని నిహారిక పేర్కొన్నారు. “మంచి సినిమా తీస్తే ఇంత గొప్ప అనుభూతి కలుగుతుందని ఇప్పుడు తెలిసింది. ఈ ఫీలింగ్ తర్వాత నేను ఎప్పటికీ సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్లను” అని ఆమె అన్నారు.
దర్శకుడు యదు వంశీ మొదటి నుంచే ఈ సినిమాకు జాతీయ అవార్డు వస్తుందని నమ్మకంగా చెప్పేవారని గుర్తు చేసుకున్న నిహారిక, తాను మాత్రం అవార్డు కోసం ఈ సినిమా నిర్మించలేదని స్పష్టం చేశారు.
“జాతీయ అవార్డు కోసం ఈ సినిమా తీయలేదు. కానీ ఈ ప్రయాణంలో ఎప్పుడో ఒక దశలో మన సినిమా కూడా జాతీయ అవార్డుల జాబితాలో ఉండాలని బలంగా కోరుకున్నాను. ఇప్పుడు ఆ కల నిజమైంది” అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
సినిమాలో నటించిన యువ నటీనటులను పాత్రలకు తగ్గట్టుగా మలచడంలో మేకప్ ఆర్టిస్ట్ పి. రవికుమార్ ఎంతో కష్టపడ్డారని, ఆయనకు జాతీయ అవార్డు రావడం వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు.
తన కుటుంబ సినీ వారసత్వాన్ని ప్రస్తావిస్తూ నిహారిక భావోద్వేగానికి గురయ్యారు. “మా నాన్న నిర్మించిన ‘రుద్రవీణ’కు మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ రోజు నేను కూడా జాతీయ అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా ఉంది. నేను కొణిదెల కుటుంబానికి చెందిన వ్యక్తిని అని చెప్పుకునేదాన్ని. ఇప్పుడు ఆ కుటుంబానికి తగ్గట్టుగా ఏదో ఒకటి సాధించాననే సంతృప్తి కలిగింది” అని అన్నారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి తనను అభినందించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, “‘రుద్రవీణ’కు మీ నాన్న జాతీయ అవార్డులు అందుకున్నారు… ఇప్పుడు నువ్వు అందుకుంటున్నావు. మాకెంతో గర్వంగా ఉంది’ అని చిరంజీవి గారు చెప్పిన మాటలు జీవితాంతం గుర్తుండిపోతాయి” అని చెప్పారు.
సినిమా విడుదలైన వెంటనే మీడియా, ప్రేక్షకులు ‘కమిటీ కుర్రోళ్లు’కి జాతీయ అవార్డు ఖాయం అని చెప్పారని, ఇప్పుడు అది నిజం కావడం ఎంతో ఆనందంగా ఉందని నిహారిక తెలిపారు. ఈ విజయానికి కారణమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియా, ప్రేక్షకులందరికీ ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు, పలు జాతీయ-అంతర్జాతీయ పురస్కారాలు అందుకోగా, తాజాగా రెండు జాతీయ అవార్డులతో తెలుగు సినీ పరిశ్రమలో మరో చిరస్మరణీయ అధ్యాయాన్ని సృష్టించింది.