
గ్రామీణ నేపథ్యంలోని భావోద్వేగాలు, స్నేహం, రాజకీయాలు, యువత జీవితాలను హృద్యంగా ఆవిష్కరించిన ‘కమిటీ కుర్రోళ్లు’ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం కథ, పాత్రలు, సహజమైన నటనతో విమర్శకుల మెప్పు కూడా పొందింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ తెలుగులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ విభాగంలో పి. రవికుమార్ జాతీయ అవార్డును అందుకున్నారు. దీంతో ఈ చిత్రం రెండు జాతీయ పురస్కారాలను ఖాతాలో వేసుకుంది.
ఇదివరకు ఈ చిత్రం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, సామాజిక పురోగతిని ప్రతిబింబించిన ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. దర్శకుడు యదు వంశీ అదే వేడుకలో ఉత్తమ తొలి దర్శకుడుగా సత్కారం అందుకున్నారు.
అంతర్జాతీయ వేదికలపైనా ఈ సినిమా ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. GAMA 2025 అవార్డ్స్‌లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా యదు వంశీ, బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్గా నిహారిక కొణిదెల అవార్డులు అందుకున్నారు. SIIMA 2025లో నిహారికకు మరోసారి బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ అవార్డు లభించగా, సందీప్ సరోజ్ బెస్ట్ డెబ్యూ యాక్టర్గా ఎంపికయ్యారు. IFFI 2025లో యదు వంశీ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ పొందడం కూడా చిత్రానికి మరో గౌరవంగా నిలిచింది.

సుమారు రూ.9 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో రూ.18.5 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా మరో రూ.6 కోట్లు రాబట్టి మొత్తం రూ.24.5 కోట్ల వ్యాపారం చేసింది. 16 మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తూ కంటెంట్‌కు ప్రాధాన్యతనిచ్చిన చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’ ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ విజయంపై నిర్మాత నిహారిక కొణిదెల ఆనందం వ్యక్తం చేశారు. తన తొలి నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. కంటెంట్‌ను నమ్మి రూపొందించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకులు, ఇప్పుడు జాతీయ అవార్డుల జ్యూరీ కూడా ప్రశంసలు అందించడం చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్నిచ్చిందని ఆమె తెలిపారు.
