నిన్న గాక మొన్న సందీప్ రెడ్డి వంగా దీపికా పదుకొనే పెట్టిన కండిషన్లను అంగీకరించకుండా ఆమెను ప్రాజెక్ట్ నుండి తప్పించారని వార్తలు వచ్చాయి. దీనిపై నెటిజన్ల నుండి దీపికా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దర్శకుడు సంజయ్ గుప్తా సెలబ్రిటీల డిమాండ్స్ గురించి తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్‌లో టాప్ నటీనటులు రెమ్యూనరేషన్‌తో పాటు షూటింగ్ సెట్‌లో ప్రత్యేక మర్యాదలు కోరుకోవడం కొత్తేమీ కాదు. అయితే కొంతమంది సెలబ్రిటీలు నిర్మాతలను షాక్‌కు గురిచేసేంత డిమాండ్స్ పెడతారనే విషయాన్ని దర్శకుడు సంజయ్ గుప్తా వెల్లడించారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన, “ఒక బాలీవుడ్ హీరో సౌత్‌లో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. షూటింగ్ లొకేషన్‌కి వెళ్లి చూడగా ఆరు వ్యానిటీ వ్యాన్లు కనిపించాయి. ఒక్క హీరో కోసం ఇన్ని వ్యానిటీలు ఎందుకని నిర్మాత ఆశ్చర్యపడ్డాడు. జిమ్, కిచెన్, మేకప్, పర్సనల్ స్పేస్ ఇలా ప్రతిదానికి వేర్వేరు వ్యానిటీలు తెప్పించుకున్నాడు. రోజుకి 18 లక్షల ఖర్చు వస్తుందని గ్రహించిన నిర్మాత వెంటనే షూట్ వాయిదా వేసి హీరోని పక్కన పెట్టేశాడు” అంటూ సంచలన విషయాలు బయటపెట్టారు.
సంజయ్ గుప్తా ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్లి, “బాలీవుడ్‌లో ఉన్న ఓ జంటతో సినిమా చేయాలంటే ఏకంగా 11 వ్యానిటీ వ్యాన్లు సిద్ధంగా ఉండాలి. వాళ్లు ప్రతి అవసరానికి వేర్వేరు వానిటీలు కోరుకుంటారు. అంతేకాదు ఓ వ్యానిటీ వ్యాన్‌ని తమ పర్సనల్ స్పేస్ కోసం వాడుకొని బట్టలిప్పి పడుకుంటారు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆయన ప్రకారం, బాలీవుడ్‌లో అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్‌లాంటి వారిని మినహాయిస్తే మిగతా కొంతమంది హీరోలు ఇలాంటి భారీ డిమాండ్స్ పెడతారని తెలిపారు.
ఇక ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. గతంలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రూపొందాల్సిన “బ్రహ్మ రాక్షస్” ప్రాజెక్ట్‌లో రణవీర్ సింగ్ పేరుతో చర్చలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా అటకెక్కిపోయింది. ఇప్పుడు సంజయ్ గుప్తా మాటలు విన్న తర్వాత ఆయన ఉద్దేశించిన హీరో ఎవరై ఉంటారని సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి.