“విజన్ రూపకల్పన చేయడమే కాదు… దాన్ని సాధ్యం చేసే దిశగా కృషి చేయాలి” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి ఏడాదికీ ముందుగానే స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని, గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది డబుల్ డిజిట్ వృద్ధి సాధించగలిగామని తెలిపారు.
వే 2 న్యూస్ కాంక్లేవ్ లో సీఎం మాట్లాడుతూ— “భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ఆలోచించాలి. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ‘సూపర్ సిక్స్’ ద్వారా ప్రజలకు సంక్షేమం అందిస్తూనే, అదే స్థాయిలో అభివృద్ధి పనులకూ నిధులు కేటాయిస్తున్నాం. రాజకీయాలు ముఖ్యమే కానీ, అంతకంటే సమాజం ముఖ్యం” అని స్పష్టం చేశారు.
“ఏదీ అసాధ్యం కాదు. నిర్ధిష్టమైన ఆలోచనతోనే ప్రణాళికలు సిద్ధం చేశాం. మెగా డ్రీమ్స్ ఉండాలి, సంకల్పం ఉండాలి, అప్పుడు సాధ్యమవుతుంది. సుస్థిరతకు, నాయకత్వానికి మారు పేరు భారతదేశమే” అని సీఎం అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలపై ఫోకస్ పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ—”హైదరాబాద్‌కు ఉన్న ప్రత్యేక ప్రయోజనాల కారణంగా ఎక్కువ అభివృద్ధి జరిగింది. ఇప్పుడు విశాఖ, అమరావతి, విజయవాడ, తిరుపతి వంటి నగరాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాం. అమరావతిలో ప్రస్తుతం చేపట్టిన ప్రతి పనిని రాబోయే మూడేళ్లలో పూర్తి చేస్తాం. రూ.50,000 కోట్ల విలువైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయి. పూర్తయిన ప్రాజెక్టులను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తాం” అని తెలిపారు.
పోలవరంపై మాట్లాడుతూ సీఎం చెప్పారు—”2019లో మేము గెలిచి ఉంటే 2021 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేది. కానీ గత ప్రభుత్వ నిర్వాకం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతింది. తిరిగి అధికారం చేపట్టిన తర్వాత పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. 2027 సెప్టెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం” అని భరోసా ఇచ్చారు.