“పనమ్మాయితో సరసం కన్నా… అత్తరు సాయిబుతో కలహం మిన్న” అని ఒక సామెత చెబుతారు పెద్దలు… ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి అలా ఉంది. ముందుకు పోలేక, వెనక్కి రాలేక సతమతమవుతున్నాడు.
అమెరికా మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగియడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఈ వైఫల్యానికి వెంటనే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిపై “దిగ్బంధం” ప్రకటించడం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలకు దారి తీసింది.
ఇస్లామాబాద్‌లో దాదాపు 21 గంటలపాటు జరిగిన ఈ చర్చలకు అమెరికా తరఫున వైస్ ప్రెసిడెంట్ “జేడీ వాన్స్” నాయకత్వం వహించారు. ఇరాన్ తరపున చర్చల్లో ప్రధానంగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ “మొహమ్మద్ బాగెర్ గాలిబాఫ్” మరియు విదేశాంగ మంత్రి “అబ్బాస్ అరఘ్చీ” పాల్గొన్నారు.. అయితే కీలక అంశాల్లో విభేదాలు తొలగకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి.
ఇరాన్ యురేనియం శుద్ధిని పూర్తిగానిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేసింది. కానీ, ఇది తమ దేశ సార్వభౌమాదికార హక్కు అంటూ ఇరాన్ నిలదీసింది.
ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గం అయిన హర్ముజ్ జల సంధి పై తన ఆధిపత్యాన్ని వదులు కోవడానికి ఇరాన్ నిరాకరించింది. ప్రతి నౌక నుండి 20 లక్షల డాలర్లు వసూలు చేస్తామని ప్రకటించింది. అలా తమకు జరిగిన యుద్ధ నష్టాన్ని పూడ్చుకుంటాము అని చెప్పింది. దీనికి అమెరికా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ విషయంలో అమెరికా ప్రపంచానికి జవాబు చెప్పాల్సిన అగత్యం ఏర్పడుతుంది. యుద్ధ పిపాసి అమెరికా అని ప్రపంచం దుమ్మెత్తిపోసే అవకాశం లేకపోలేదు.
గతంలో చర్చలు ఒక పక్క జరుపుతూనే అమెరికా ఇరాన్ పై దాడి చేయడం వలన, ఇరాన్ కు నమ్మకం లేదు. పరస్పర అనుమానాలు ఈ చర్చలను ముందుకు సాగనివ్వలేదు. చర్చలు విఫలమైన వెంటనే ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హార్మోజ్ జల సంధిని దిగ్బంధం చేస్తానని చెప్పి, నౌకాదళాన్ని మోహరించారు.
ఇరాన్ ఓడరేవుల నుంచి వచ్చే, వెళ్లే నౌకలను అడ్డుకునేలా అమెరికా తన నౌకాదళాన్ని రంగంలోకి దించింది. ఇరాన్‌కు ఎలాంటి ఫీజులు చెల్లించవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
అమెరికా సముద్రంలో సీ మైన్స్ తొలగించే చర్యలు ప్రారంభించింది. ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్…. “సీ మైన్స” ముప్పు మూలంగా ఎక్కడి నౌకలు అక్కడే స్తంభించిపోయాయి. హర్మూజ్ జలసంధిలో ఈ తొలగింపు ప్రక్రియ కోసం అత్యంత అధునాతనమైన “మైన్ స్వీపర్స్” ను రంగంలోకి తీసుకొచ్చింది అమెరికా, ఇనుముతో తయారు చేసిన నౌకలను… అయస్కాంత శక్తి మూలంగా “సీ మైన్స్” ఆకర్షిస్తాయి. సాధారణంగా ఇనుముతో కాకుండా చెక్క లేదా ఫైబర్ గ్లాస్‌తో తయారు చేస్తారు. ఎందుకంటే కొన్ని “సీ మైన్స్” మాగ్నెటిక్ సిగ్నల్స్‌ను గుర్తించి పేలుతాయి. లోహంతో చేసిన నౌకలు దగ్గరికి వెళ్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయస్కాంత ప్రభావం తగ్గించడానికి ప్రత్యేక పదార్థాలతో తయారు చేసిన నౌకలు ఉపయోగించాల్సి ఉంటుంది.
సోనార్ టెక్నాలజీ తో నీటి అడుగున “సీ మైన్స్” గుర్తించడం… (ROV) రోబోల ద్వారా వీటిని పేల్చడం, లేదా స్వీపింగ్ పద్ధతి లో వీటిని పైకి తెచ్చి నిర్వీర్యం చేయడం లాంటి పద్ధతులే కాకుండా….USA నావికా దళం… “డాల్ఫిన్లు”, “సీ లయన్స్” లాంటి సముద్ర జీవులను మచ్చిక చేసుకుని వాటి ద్వారా ఈ సీ మైన్స్ గుర్తించవచ్చు అని అంటున్నారు కాని, అలా ఆధారాలు ఇప్పటి వరకు కానరాలేదు. ఇలా అనేక పద్ధతులను ఉపయోగిస్తున్నారు.
చమురు ధరల పెరుగుదల చాలా భారంగా, పెను ముప్పుగా మారబోతున్నాయి. ప్రపంచ చమురులో 20% ఈ మార్గం గుండా వెళ్తుంది. ఇప్పటికే ధరలు బ్యారెల్‌కు $100 దాటాయి. ఇరాన్, అమెరికా చర్యలను “సముద్రపు దోపిడీ” గా అభివర్ణించి, ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.
భారత్ తన చమురు అవసరాల్లో సింహభాగం హర్మూజ్ మార్గంపైనే ఆధారపడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అధికమవుతుంది. వాణిజ్య రవాణా కు అంతరాయం సరుకు రవాణా ఖర్చులు పెరిగి ఎగుమతులు ప్రభావితమవుతాయి. భారత నౌకలు, సిబ్బంది భద్రతకు ముప్పు పెరుగుతుంది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో భారత్ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలపై దృష్టి పెడుతుంది. ఇతర దేశాల నుంచి చమురు దిగుమతులు పెంచుకునే దిశ గా చర్యలకు ఉపక్రమిస్తుంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం బెడిసికొట్టడంతో… తటస్థ దేశం అయిన భారత్ మధ్యవర్తిగా సయోధ్య కుదిర్చే అవకాశం ఉంది అంటున్నారు… ప్రపంచ రాజకీయ విశ్లేషకులు.
హర్మూజ్ జలసంధి సంక్షోభం కేవలం అమెరికా, ఇరాన్ మధ్య సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా చమురు ఆధారిత దేశాలకు పెద్ద సవాలు. పరిస్థితి యుద్ధ దిశగా మారితే, దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ వంటి దేశాలు సమతుల్య దౌత్యం, ప్రత్యామ్నాయ శక్తి వనరులపై దృష్టి పెట్టడం అత్యవసరం.