రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం “రాజా సాబ్” టీజర్‌కు విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మారుతి మాట్లాడుతూ తన ప్రయాణం, చుట్టూ ఉన్న అనుమానాలు, మరియు ప్రభాస్ సపోర్ట్ గురించి చెప్పుకొచ్చారు.
“మా ఇంట్లో వాళ్లు కూడా – ‘ఏంటీ నువ్వు ప్రభాస్ తో సినిమా చేస్తున్నావా?’ అనేవారు. అంతవరకూ నేను చేసిన సినిమాలు చూసి, అలాంటి భారీ పాన్-ఇండియా హీరోతో నువ్వు ఎలా సినిమా చేస్తావు అని అడిగారు. కానీ ప్రభాస్ గారు నన్ను అలా గట్టిగా నమ్మడం చూసి నేను గర్వపడుతున్నాను,” అంటూ మారుతి తెలిపారు.
మూవీ ప్రారంభంలో జరిగిన ఆసక్తికర విషయాల్ని మారుతి పంచుకున్నారు. “ఒకరోజు యూవీ వంశీ గారు నన్ను పిలిచి, ‘ప్రభాస్ తో సినిమా చేస్తావా?’ అన్నారు. ముంబైకి వెళ్లి ప్రభాస్ గారిని కలవాల్సిందిగా చెప్పారు. ఆయనను కలవడం దేవుడిని కలిసినట్లు అనిపించింది. ఆయన ‘నన్ను డార్లింగ్ అని పిలవచ్చు’ అని అన్నారు. ‘మీ ప్రేమకథా చిత్రం, భలే భలే మగాడివోయ్’ చాలా ఇష్టం. అలాంటి సినిమా చేద్దామని అన్నారు,”.
“అప్పుడు నేను ఇటీవల చేసిన పక్కా కమర్షియల్ ఫలితం అంత బాగోలేదు కాబట్టి, ప్రభాస్ గారి లాంటి స్టార్ తో సినిమా చేయడం కరెక్టేనా అని స్నేహితులకు, ఇంట్లో వాళ్లకు కూడా సందేహమే. కానీ ఆ సమయంలో నన్ను వదలకుండా ప్రోత్సహించిన ఒక్క వ్యక్తి ప్రభాస్ గారు మాత్రమే. నా కథలోని కొన్ని పాయింట్లు ఆయనకు బాగా నచ్చడంతో, ఆయన స్వయంగా కాల్ చేసి, సినిమా చేద్దామని చెప్పారు,” అని చెప్పారు.
“ఫ్యాన్స్ రియాక్షన్స్ ప్రభాస్ గారికి పంపుతుంటాను. ఆయన ఫ్యాన్స్‌ను నేరుగా కలవకపోయినా, వాళ్ల కోసం ఆయన ఎంతగా కష్టపడతారో నేను చూశాను. ఈ సినిమాలో ఆయన ముగ్గురు హీరోయిన్స్‌తో కనిపిస్తారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా, కామెడీ, ఎమోషన్, మ్యాజిక్ అన్నీ మిక్స్ చేశాం. వింటేజ్ ప్రభాస్, బుజ్జిగాడు టచ్, డ్యాన్స్, మాస్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి. ఇంకా కొంత షూటింగ్, సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నా, డిసెంబర్ 5న రాజా సాబ్ గ్రాండ్‌గా విడుదల అవుతుంది,” అని మారుతి తెలిపారు.