వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మణికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మురళీకాంత్ తెరకెక్కించారు. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ట్రైలర్ ప్రారంభం నుంచే బలమైన ఇంపాక్ట్ ఇస్తుంది. ఊరి బయట శవాన్ని మోస్తూ వెళ్తున్న సన్నివేశం, “మన చావు పుట్టకులన్నీ ఆ ఊరి బయటే రాసిండ్రా ఆ దేవుడు” అనే డైలాగ్‌తో గ్రామంలో పాతుకుపోయిన కులవ్యవస్థను స్పష్టంగా ఆవిష్కరిస్తుంది. ఈ ఒక్క డైలాగ్‌తోనే సినిమా థీమ్ ఏంటో దర్శకుడు క్లియర్‌గా చెప్పేశారు.
ఓటు, సర్పంచ్, కుల పెద్దలు, అధికార రాజకీయాలు—ఈ అన్నింటినీ హ్యూమర్, సాటైర్, ఎమోషన్ కలిపి చూపించారు.
“ఓటుకి గుద్దినావో… క్వార్టర్ గుద్ది ఇంట్లో పడినావో ఎవడు చూసిండవయ్యా” వంటి డైలాగ్స్ నవ్విస్తూనే వ్యవస్థపై ప్రశ్నలు వేస్తాయి. అలాగే “చావు నుంచైనా తప్పించుకోవచ్చు కానీ… కులం నుంచి తప్పించుకోలేం రా” అనే లైన్ ట్రైలర్‌కే హార్ట్‌గా నిలుస్తుంది.
శివాజీ పాత్రలో సీరియస్‌నెస్, ఆగ్రహం రెండూ కనిపిస్తాయి. బిందు మాధవితో ఆయన మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ట్రైలర్‌కు మంచి వెయిట్ ఇస్తాయి. నవదీప్ అట్టడుగు వర్గాల నుంచి ఎదిగి ప్రెసిడెంట్ అయ్యే పాత్రలో కనిపిస్తూ, కుల పెద్దలతో ఎదురుదెబ్బలు ఎలా ఉంటాయో బలంగా చూపించారు. నందు, రవికృష్ణ, మణిక పాత్రల మధ్య ప్రేమ, కుటుంబ ఘర్షణలు కూడా సహజంగా నడిచాయి.
“మన బతుకులు మారాలంటే మనకు కావాల్సిందొక్కటే… చదువు” అనే డైలాగ్‌తో దర్శకుడు తన సామాజిక సందేశాన్ని నేరుగా ప్రేక్షకులకి అందించాడు. చివర్లో నవదీప్ మాస్ స్టెప్స్‌తో వచ్చే టైటిల్ ట్రాక్ సినిమాకు కమర్షియల్ ఎనర్జీని జోడించింది.
మొత్తంగా, ‘దండోరా’ ట్రైలర్ కులవ్యవస్థపై ప్రశ్నలు వేస్తూనే, వినోదం, భావోద్వేగం, కమర్షియల్ అంశాలను సమతూకంగా మేళవించినట్టు స్పష్టంగా చూపిస్తోంది. గ్రామంలో కుల వ్యవస్థపై ఎవరు దండోరా వేశారు? చివరికి ఏమైంది? అన్న ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్ కట్ చేయడం మేకర్స్ విజయంగా చెప్పుకోవచ్చు. సమాధానాల కోసం డిసెంబర్ 25న థియేటర్లలో సినిమా చూడాల్సిందే.