రిలీజ్ కి ముందే భారీ హైప్ సృష్టించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ “OG” విడుదలతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ మళ్లీ ముదురుతోంది. గతంలో అల్లు అర్జున్ హిట్ మూవీ “పుష్ప”(Pushpa)పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
అప్పట్లో ఆయన, “అడవులను కాపాడే వారిని హీరోలు అంటారు, కానీ ఇప్పుడు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే వారిని కూడా హీరోలుగా చూపిస్తున్నారు” అని వేరే సందర్భంలో వ్యాఖ్యానించగా, అది పుష్ప 2 రిలీజ్ సమయంలో ఆ వ్యాఖ్యలు అనేసరికి బన్నీ అభిమానులకు అంతగా నచ్చలేదు.
ఇప్పుడు ఓజీ(They Call Him OG) విడుదలతో బన్నీ అభిమానులు మళ్లీ ఆ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మీమ్స్, కామెంట్లు, స్క్రీన్‌షాట్లు విపరీతంగా షేర్ అవుతూ, “పుష్ప స్మగ్లర్ సినిమా అయితే, ఓజీ భక్తి సినిమానా?” అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. వీటికి సమాధానంగా పవన్ అభిమానులు, “పుష్పలో హీరో స్మగ్లింగ్ చేసే వాడే, కానీ మా హీరో ఓజీ లో అలాంటి వాటికి ఛాయలు కూడా రాకుండా చూసే వ్యక్తి” అని కౌంటర్లు ఇస్తున్నారు.
ఇక ఇదే టైములో నందమూరి అభిమానులు కూడా ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను నేరుగా టార్గెట్ చేస్తూ, “డిజాస్టర్ ఓజీ” అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను నేషనల్ ట్రెండ్‌లోకి తీసుకువెళ్లారు. దీంతో సోషల్ మీడియాలో పుష్ప, ఓజీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్ మరింత వేడెక్కింది. మూడు ఫ్యాన్ బేస్‌లు ఒకేసారి రంగంలోకి దిగి కౌంటర్ల మీద కౌంటర్లతో, హ్యాష్‌ట్యాగ్‌లతో నిండిన పోస్టులు పెడుతుండటంతో వాతావరణం మరింత హాట్‌గా మారింది.
అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ పోరాటం కేవలం వర్చువల్ వరల్డ్‌కే పరిమితమవుతోంది. వాస్తవంగా మాత్రం పవన్ కళ్యాణ్ క్రేజ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఓజీ ప్రీమియర్ షోలు, అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే భారీ రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం నెలకొంది. అనుకున్నంత హైప్‌తో సినిమాకు సూపర్ స్టార్ట్ లభించడం, పవన్ మార్కెట్ ఇప్పటికీ ఎలాంటి తగ్గుదల లేకుండా కొనసాగుతోందని నిరూపిస్తోంది.
మొత్తం మీద, సోషల్ మీడియాలో అభిమాన యుద్ధాలు రెచ్చిపోతున్నా, థియేటర్ల దగ్గర మాత్రం పవన్ పవర్ హవా కొనసాగుతోంది.