వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ‘హరి హర వీరమల్లు’ కి ఫైనల్ గా కొత్త డేట్ ప్రకటించారు మేకర్స్. జూలై 24న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’ విడుదలకు సిద్ధమైంది. చారిత్రాత్మక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం చిత్రం విభిన్నమైన యాక్షన్ ఎంటర్టైనర్.
పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడిగా తొలిసారి కనిపించనుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లోనే కాదు, సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ వీడియోలు, పాటలు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందనను పొందాయి. ముఖ్యంగా ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, ‘అసుర హననం’, ‘తార తార’ వంటి పాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
సినిమాటోగ్రఫీ బాధ్యతలు మనోజ్ పరమహంస మరియు జ్ఞాన శేఖర్ వి.ఎస్. భుజాలపై ఉండగా, ఎడిటింగ్‌ను ప్రవీణ్ కె.ఎల్. అందిస్తున్నారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి చారిత్రాత్మక యుగాన్ని ప్రతిబింబించే విధంగా అద్భుతమైన సెట్లు రూపొందించారు.
చారిత్రక నేపథ్యం, భావోద్వేగ నాటకీయత, పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుందని చిత్ర బృందం ధీమాగా చెబుతోంది.