‘దేవి’, ‘శత్రువు’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘మనసంతా నువ్వే’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి కల్ట్ చిత్రాల నిర్మాతగా పేరుపొందిన ఎం.ఎస్. రాజు, ‘డర్టీ హరి’, ‘మళ్లీ పెళ్లి’ చిత్రాల ద్వారా దర్శకుడిగా కూడా తన ముద్ర వేసిన ఆయన, ఇప్పుడు మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన తాజా చిత్రం ‘అగధ’ ఒక మర్మమైన, దైవిక థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది.
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మరో కీలక ప్రకటన వచ్చింది. ఆ పోస్టర్‌లో దైవ విగ్రహం ముందు కనిపించిన రహస్య యువతి మరెవరో కాదు, కామాక్షి భాస్కర్ల అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఆమె ఈ చిత్రంలో ‘మహాదేవి’ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు.
ఈ ప్రకటనతో, మొదటి పోస్టర్‌లో కనిపించిన ఆధ్యాత్మిక దృశ్యానికి ఇప్పుడు ఒక స్పష్టమైన రూపం లభించింది. త్రిశూలాలు, దీపాలు, ఎత్తైన విగ్రహం మధ్య సాంప్రదాయ నల్ల చీరలో గంభీరంగా కూర్చున్న కామాక్షి భాస్కర్ల లుక్ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. ఆమె హావభావాలు, ఆధ్యాత్మిక నేపథ్యం కలిసి మహాదేవి పాత్ర కథలో ఎంతో ప్రాముఖ్యత కలిగినదని సూచిస్తున్నాయి. ఈ పాత్ర సాధారణం కాదని, కథ యొక్క ఆధ్యాత్మిక మూలాలతో బలంగా అనుసంధానమై ఉందనే సంకేతాలు ఇస్తోంది.
ఇక ఫస్ట్ లుక్‌కు వచ్చిన అద్భుతమైన స్పందనతో ఉత్సాహంగా ఉన్న ఎంఎస్ రాజు, ప్రేక్షకులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు అందించిన ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఫోన్ కాల్స్, సందేశాలు, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ప్రేమ తన కథపై ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచిందని ఆయన చెప్పారు. ఒక రచయితగా, దర్శకుడిగా ఈ స్పందన తనను మరింత శ్రద్ధతో పనిచేయడానికి ప్రేరేపిస్తోందని తెలిపారు.
నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో, శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘అగధ’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సుమారు 45 నిమిషాల విఎఫ్‌ఎక్స్, విస్తృతమైన సెట్స్, 85 రోజుల షూటింగ్‌తో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.