సినిమా వార్తలు

‘మాస్ జాతర’లో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్త పాయింట్ – దర్శకుడు భాను భోగవరపు

Published by
Rahul N

మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రం ‘మాస్ జాతర’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అక్టోబర్ 31న థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొంది.

రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేష స్పందనను అందుకున్నాయి.

తాజాగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు భాను భోగవరపు, ‘మాస్ జాతర’ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

రైల్వే పోలీస్ నేపథ్యంలోని కొత్త మాస్ కథ

దర్శకుడు మాట్లాడుతూ … “ఈ సినిమా రైల్వే పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఆ నేపథ్యంలోని క్రైమ్‌ కొత్తగా ఉంటుంది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్త పాయింట్ కూడా ఉంటుంది. ‘మాస్ జాతర’ అనే టైటిల్ రవితేజ గారే సూచించారు. ఆయన ఆ టైటిల్ చెప్పిన తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. థియేటర్‌లో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌లు ఖాయం,” అన్నారు.

రవితేజ 75వ సినిమా…

“ఇది రవితేజ గారి 75వ సినిమా అని మాకు షూటింగ్ మధ్యలో తెలిసింది. ఆయన ఈ సంఖ్యల గురించి ఆలోచించకుండా, ప్రశాంతంగా సినిమా చేయమని చెప్పి చాలా ప్రోత్సహించారు,” అన్నారు భాను.

నవీన్ చంద్ర విలన్‌గా…

“శివుడు పాత్ర కోసం మొదట వేరే పేర్లు ఆలోచించాం. కానీ నవీన్ చంద్ర గారిలో కావాల్సిన తీవ్రత కనిపించింది. ఆయన లుక్‌కి ప్రత్యేక మేకోవర్ ఇచ్చాం. సినిమా తర్వాత ఆయన పాత్ర అందరి నోట వుంటుంది,” అని దర్శకుడు తెలిపారు.

శ్రీలీల – ‘తులసి’గా కీలక పాత్ర

“తులసి పాత్ర కోసం వేరెవరినీ అనుకోలేదు. కథ రాసే సమయంలోనే మా మనసుల్లో శ్రీలీలే ఉన్నారు. ‘ధమాకా’ జోడి అని కాకుండా, పాత్రకు పర్ఫెక్ట్ ఫిట్ ఆమెనే. రవితేజ గారు – శ్రీలీల గారి సన్నివేశాలు మాస్, ఎమోషన్ కలయికగా ఉంటాయి,” అన్నారు.

మాస్, కామెడీ మేళవింపు

“నేను కామెడీ రైటర్‌గా పేరుపొందినా, దర్శకుడిగా మాస్ సినిమా చేయాలని అనిపించింది. మాస్ జాతరలో కూడా వినోదం పుష్కలంగా ఉంటుంది. రవితేజ గారిని దృష్టిలో పెట్టుకుని కథ రాశాను. రైల్వే పోలీస్ థీమ్ కొత్తదనంగా ఉంటుంది,” అన్నారు భాను.

యాక్షన్, మ్యూజిక్ హైలైట్

“రవితేజ గారు యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డారు. షూటింగ్ సమయంలో గాయాలైనా, ఆయన ఉత్సాహం తగ్గలేదు. భీమ్స్ గారి సంగీతం సినిమాకు మరింత ఎనర్జీని ఇచ్చింది. ‘తు మేరా లవర్’ సాంగ్ మొదట విన్నప్పుడే అది సూపర్ హిట్ అవుతుందని అర్థమైంది,” అన్నారు.

నిర్మాతల మద్దతు

“కొత్త దర్శకుడినైనా, నాగవంశీ గారు పూర్తిగా నాపై నమ్మకం ఉంచారు. ఆరున్నర కోట్లతో స్టేషన్ సెట్, భారీ జాతర సెటప్ వేయించారు. అటువంటి మద్దతు లేకుండా ఈ స్థాయి సినిమా సాధ్యం కాదు,” అని దర్శకుడు అభిప్రాయపడ్డారు.

‘మాస్ జాతర’ – ప్రేక్షకులకు హామీ

“రవితేజ గారి సినిమాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఉంటాయి. అయితే కథ, సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. వినోదం, యాక్షన్, భావోద్వేగం – అన్నీ సమపాళ్లలో ఉన్నాయి,” అని భాను భోగవరపు తెలిపారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో విజయవంతమైన రచయితగా పేరుపొందిన ఆయన, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Rahul N