పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో రెండో సినిమా కోసం సన్నాహాలు పూర్తి చేసుకుంటోంది నిహారిక కొణిదెల . ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆమె ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్‌కు రచయితగా, ‘బెంచ్ లైఫ్’ కు దర్శకురాలిగా పనిచేసి తన సత్తా చాటారు. ఇప్పుడు ఆమె ఫీచర్ ఫిల్మ్ దర్శకురాలిగా ఈ సినిమాతో ఆరంగేట్రం చేయబోతున్నారు.
ఈ చిత్రంలో కథానాయకుడిగా యువ నటుడు సంగీత్ శోభన్ నటిస్తున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ వంటి చిత్రాల్లో తన సహజమైన నటనతో ఆకట్టుకున్న సంగీత్, ఈ సినిమాతో సోలో హీరోగా తొలి అడుగు వేస్తున్నాడు. ఇప్పటికే నిహారిక నిర్మించిన కొన్ని వెబ్ ప్రాజెక్ట్స్‌లో సంగీత్ – మానస జోడీ పనిచేసింది.
సంగీత్ శోభన్ సరసన నాయికగా నయన్ సారిక నటిస్తోంది. ‘ఆయ్’, ‘క’ వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన నయన్, ‘హలో వరల్డ్’ (Zee5), ‘బెంచ్ లైఫ్’ (SonyLIV) వంటి వెబ్ సిరీస్‌లతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు వంటి బలమైన తారాగణం ఈ చిత్రంలో నటించనున్నారు.
ఈ చిత్రానికి కథను మానస శర్మ స్వయంగా అందించగా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను మహేష్ ఉప్పల సహ రచయితగా అందించారు.
ఇప్పటికే ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి విజయవంతమైన సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలిచిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఇప్పుడు మరో ఆసక్తికర చిత్రంతో ముందుకు వస్తోంది. సంగీత్ – మానస కాంబినేషన్, నిహారిక నిర్మాణ విలువలు, బలమైన కథతో కూడిన ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.