సినిమా వార్తలు

సినిమా థియేటర్లపై పవన్ ఫోకస్

Published by
Rahul N

థియేటర్ల బంద్ వివాదం ఎక్కడో మొదలైంది, ఇంకేదో టర్న్ తీసుకుంది. అసలు దీని మూలాలు కనుగొనే ప్రయత్నం మొదలుపెట్టారు పవన్ కల్యాణ్. అందుకే సినిమా థియేటర్ల వ్యవస్థపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు డిప్యూటీ సీఎం.

టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్ కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై డిప్యూటీ సీఎం పవన్, అధికారులతో చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోను గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు పవన్ కల్యాణ్. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ అనేవి యజమానులు కనీస బాధ్యతలని, వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకొంటాయన్నారు.

తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల నేపథ్యం, ఆ నలుగురు ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడటం… తదితర అంశాలు చర్చకు వచ్చాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైనా చర్చించారు. ఈ ప్రకటన వెనక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు.

Rahul N