మహాభారతం సభాపర్వం లో ద్రౌపతి వస్త్రాపహరణం ఘట్టంలో ద్రౌపతి ఈ విధంగా అడుగుతుంది. “నా స్వామి… నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా?” అని… అలా ఉంది మన పార్లమెంట్ సభ్యుల తీరు. ఏది ఏమైనా మహిళా, డెలిమిటేషన్ బిల్లు రెండు రోజుల చర్చ అనంతరం రక్తహస్తలతో బయటకు వచ్చారు.
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏప్రిల్ 17, 2026 ఒక చారిత్రాత్మక రోజు గా మిగిలిపోతుంది. 2014 తర్వాత మోదీ ప్రభుత్వం లోక్‌సభలో ఎదుర్కొన్న తొలి శాసనపరమైన ఓటమి ఇది. మహిళా రిజర్వేషన్లు మరియు డీలిమిటేషన్ కు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం, దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక బిల్లు ఓటమి మాత్రమే కాదు, రాబోయే సార్వత్రిక ఎన్నికల దిశను మార్చే ఒక బలమైన రాజకీయ అస్త్రం.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినా, అది వెంటనే అమలులోకి రాకపోవడానికి ప్రభుత్వం రెండు షరతులు పెట్టింది. “జనగణన” (Census) కొత్త జనాభా లెక్కలు జరగాలి. “డీలిమిటేషన్” (Delimitation) జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చాలి.
విపక్షాల వాదన ఏమిటంటే, ఈ రెండు షరతులు పెట్టడం వల్ల మహిళా రిజర్వేషన్లు 2029 లేదా ఆ తర్వాత వరకు వాయిదా పడతాయని, ఇది మహిళలను మోసం చేయడమేనని వారు భావిస్తున్నారు. కోటాలో కోటా OBC మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ ద్వారా వెనుకబడిన వర్గాల ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చని భావిస్తున్నారు.
సాధారణంగా ఏదైనా బిల్లు ఓడిపోతే అది ప్రభుత్వ వైఫల్యంగా పరిగణించబడుతుంది. కానీ బీజేపీ దీనిని ఒక “నైతిక విజయం”గా మలచుకునే ప్రయత్నం చేస్తోంది అది ఎలా అన్నది చూద్దాం. “మేము మహిళల కు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రయత్నించాం, కానీ విపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా సాధికారతను అడ్డుకున్నాయి” అనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. రాజ్యాంగబద్ధతతో కూడిన “డీలిమిటేషన్” లేకుండా రిజర్వేషన్లు అమలు చేయడం అశాస్త్రీయమని, తాము రాజ్యాంగబద్ధమైన ప్రక్రియనే అనుసరించాలని చూశామని సమర్థించుకుంటోంది.
పార్లమెంట్‌లో విపక్షాలు అన్ని ఏకమై అభివృద్ధిని ఎలా అడ్డుకుంటున్నాయో చెప్పడానికి ఈ ఓటమిని ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చూపించబోతుంది. ఇప్పుడు తమిళనాడు, ప. బెంగాల్ లో ఇదే ప్రధాన అస్త్రం అయ్యే అవకాశాలు ప్రస్పుటంగా కనపడుతున్నాయి.
ఇక్కడ బీజేపీ కూటమి (NDA) మరియు విపక్షాల (I.N.D.I.A) కూటమి లాభ, నష్టాల విశ్లేషణ చూద్దాం…
మహిళా ఓటర్లలో సానుభూతి పొందే అవకాశం ఉంది. విపక్షాలను బిల్లు కు ఆమోదం తెలపనందుకు “ప్రగతి వ్యతిరేకులు”గా ముద్ర వేసి దేశవ్యాప్తంగా వారిపై నిరసనలకు దిగారు. కాని సంఖ్యాబలం ఉన్నా బిల్లును పాస్ చేసుకోలేకపోయారనే విమర్శ తో పాటు, దక్షిణాది రాష్ట్రాల్లో “డీలిమిటేషన్” వల్ల సీట్స్ తగ్గిపోతాయనే భయం ని తొలగించలేకపోవడం తో పాటు… ప్రతిపక్షాలను కూడగట్టలేకపోయారనే అపప్రద ను మూటగట్టుకున్నారు.
“డీలిమిటేషన్” ద్వారా దక్షిణాది సీట్లు తగ్గకుండా తాత్కాలికంగా అడ్డుకుని… కూటమి ఐక్యతను నిరూపించుకోగలిగారు. మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో మొదటిసారి పార్లమెంట్ లో పెట్టిన బిల్లు వీగిపోవడం తో తామంతా ఐకమత్యం గా ఎదుర్కొని మోదీ కి ఎదురు నిలిచినట్లుగా ప్రజా క్షేత్రం లోకి వెళ్ళడం. కాని మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నారనే అపవాదును మోయక తప్పదు. దేశం లో ముఖ్యమైన సంస్కరణలకు ఆటంకం కలిగిస్తున్నారనే నెగటివ్ ప్రచారం కూడా వీళ్లపై పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఈ రాజకీయ సంక్షోభం నుండి బయటపడటానికి బీజేపీ ప్రభుత్వం ‘ప్లాన్-బి’ని సిద్ధం చేసే అవకాశం ఉంది. “ప్రత్యేక ఆర్డినెన్స్” లేదా “డీలిమిటేషన్” నిబంధనను పక్కన పెట్టి లేదా దానిపై స్పష్టమైన హామీ ఇస్తూ, కేవలం “మహిళా రిజర్వేషన్” కోసం మాత్రమే ఒక ప్రత్యేక బిల్లును త్వరలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనివల్ల విపక్షాలకు అడ్డు చెప్పే అవకాశం ఉండదు. అలా కొంత నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశం ఉంది బీజేపీకి.
“డీలిమిటేషన్” వల్ల దక్షిణాది సీట్లు తగ్గవని, కొత్తగా సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా అందరికీ న్యాయం చేస్తామని ఒక ప్రత్యేక కమిటీని వేసి, దక్షిణాది రాష్ట్రాలకు భరోసా ఇవ్వడం ద్వారా తమ ప్రతిష్టను పెంచుకోవచ్చు. పార్లమెంట్‌లో జరిగిన పరాభవాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి, రాబోయే ఎన్నికల్లో విపక్షాలకు బుద్ధి చెప్పాలని కోరుతూ పెద్ద ఎత్తున, ప్రజా క్షేత్రంలో “మహిళా గర్జన” సభలు నిర్వహించి, పోరాటాలు చేసే అవకాశం ఉంది. ఈ పరిణామం వల్ల తక్షణమే నష్టపోయింది మహిళా ప్రాతినిధ్యమే అయినప్పటికీ, రాజకీయంగా మాత్రం ఇది అధికార, విపక్షాల మధ్య యుద్ధాన్ని మరింత తీవ్రం చేసింది. బీజేపీ ఈ ఓటమిని ఒక సానుకూల అంశంగా మార్చుకుని ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తుంటే, విపక్షాలు రాష్ట్రాల హక్కుల పరిరక్షణను తమ అస్త్రంగా చేసుకుంటున్నాయి.
ముగింపు :
అంతిమంగా, జూన్ 2026లో జరగబోయే కీలక రాజ్య సభ ఎన్నికలే ఈ “పార్లమెంట్ పోరు”లో ఎవరిది పైచేయి అనేది నిర్ణయిస్తాయి.
ఏది ఏమైనా… “కోర్టులో కేసు ఓడిపోయినవాడు కోర్టులో ఏడిస్తే, గెలిచిన వాడు ఇంటికి వెళ్ళి ఏడ్చాడట” అర్థమైన వారికి అర్థమైనంత.