సినిమా వార్తలు

16 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘రక్త చరిత్ర’.. జూలై 17న రీ రిలీజ్

Published by
Srinivas

మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలతో పాటు యథార్థ ఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన రూపొందించిన అత్యంత సంచలనాత్మక చిత్రాల్లో ‘రక్త చరిత్ర’ ఒకటి. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో, ఒకప్పుడు బద్ధ శత్రువులుగా పేరొందిన పరిటాల రవి, మద్దెలచెరువు సూరి జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

2010లో విడుదలైన ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. విడుదల సమయంలో ఈ చిత్రం భారీ చర్చకు దారి తీస్తూ ప్రేక్షకుల ఆదరణను పొందింది. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది.

ఇప్పుడు దాదాపు 16 ఏళ్ల తర్వాత ‘రక్త చరిత్ర’ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం జూలై 17న థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. అప్పట్లో ఎలాంటి ఒత్తిళ్లు, వివాదాలు, బెదిరింపులకు లొంగకుండా రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. విడుదల అనంతరం ఈ సినిమా సంచలనంగా మారి తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

సినిమాలో నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయిన తీరు, రామ్ గోపాల్ వర్మ టేకింగ్, వాస్తవికతకు దగ్గరగా ఉండే కథనం, అప్పటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయి. అలాగే “రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్తచరిత్ర” అంటూ సాగే నేపథ్య గీతం, “కత్తులతో సావాసం.. నెత్తుటితో సమాప్తం” వంటి పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో చూడాలంటూ అభిమానులు చాలా కాలంగా కోరుతున్నారు. అంతేకాకుండా నేటి తరం ప్రేక్షకులకు కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ క్లాసిక్‌ను పరిచయం చేయాలనే ఉద్దేశంతో రీ రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

రీ రిలీజ్‌కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను కూడా మేకర్స్ ప్రారంభించనున్నారు. త్వరలో హైదరాబాద్‌లో ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts