సినిమా వార్తలు

మేఘాంశ్ శ్రీహరి ‘స్టూడెంట్’ ఫస్ట్ లుక్ రిలీజ్..

Published by
Srinivas

స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “స్టూడెంట్”. విజేత పరీక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్లపై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తుండగా, బెల్లం సంగీత, బెల్లం బయ్యారెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ రోజు చిత్ర బృందం “స్టూడెంట్” ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో మేఘాంశ్ శ్రీహరి ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఒక సాధారణ స్టూడెంట్ జీవితంలో కనిపించే ఎన్నో అంశాలను పోస్టర్‌లో ఆసక్తికరంగా చూపించారు. పవర్ స్టార్ సినిమాకు బ్యానర్లు కట్టడం, జామెట్రీ బాక్స్‌లోని డివైడర్‌ను క్లాస్‌రూమ్ కంటే ఫైట్స్‌కు ఉపయోగించడం, కాల్చిన సిగరెట్, ప్రేమలేఖలు వంటి అంశాలు పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పోస్టర్‌పై ఉన్న “ధైర్యం ఉన్నవాడే తన వెంట అందరూ నడిచేలా చేసుకుంటాడు” అనే కోటేషన్ హీరో పాత్రలోని తెగువను, నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తోంది. అలాగే “ఈ భాను గాడు అంతా చూసుకుంటాడు… నువ్వు లవ్ చేయి. తన్మయ్ లవ్స్ భాను…” అనే డైలాగ్ సినిమాలో బలమైన ప్రేమకథ కూడా ఉండబోతుందనే సంకేతాలను ఇస్తోంది.

మొత్తంగా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే, “స్టూడెంట్” ఒక యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్‌తో మేఘాంశ్ శ్రీహరి కెరీర్‌లో ఇది ఒక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలవొచ్చనే అంచనాలు పెరిగాయి.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.