
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన నేపథ్యంలో చిత్ర బృందం ఘనంగా ‘పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్’ నిర్వహించింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, టీమ్ సభ్యులను ప్రత్యేకంగా సత్కరించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ‘పెద్ది’ సినిమా తనను పూర్తిగా కదిలించిందని అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా గ్రామీణ నేపథ్యంలోని భావోద్వేగాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించారని ప్రశంసించారు. అలాగే రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, “సినిమా చూస్తున్నప్పుడు చరణ్ కనిపించలేదు.. పెద్ది మాత్రమే కనిపించాడు” అన్నారు.
చరణ్ ఈ పాత్ర కోసం చేసిన కృషి, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న గాయాలు గుర్తు చేసుకుంటూ ఒక తండ్రిగా గర్వంగా ఉందన్నారు. “అవార్డులు రావచ్చు, రాకపోవచ్చు.. కానీ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడమే గొప్ప అవార్డు” అని పేర్కొన్నారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ ‘పెద్ది’ విజయం తన జీవితంలో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందన్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు తమ సొంత చిత్రంలా ఆదరించారని, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సినిమాను ఎంజాయ్ చేయడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. “ఇప్పుడు మా ఇంట్లో కూడా నన్ను నాన్న అని కాకుండా ‘పెద్ది’ అని పిలుస్తున్నారు” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ, పెద్ది పాత్రను ప్రేక్షకులు జీవితాంతం గుర్తుంచుకునేలా చేసిన ఘనత రామ్ చరణ్‌కే చెందుతుందని అన్నారు. సుకుమార్ తనకు గురువని, ఆయన లేకపోతే తాను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదని తెలిపారు.
సుకుమార్ మాట్లాడుతూ, కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా ఉన్న కథను నమ్మి చేసిన రామ్ చరణ్, బుచ్చిబాబులను అభినందించారు. నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ, ప్రేక్షకుల ఆదరణ వల్లే ‘పెద్ది’ భారీ విజయాన్ని అందుకుందని తెలిపారు.
ఇక దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ‘పెద్ది’ విజయాన్ని తెలుగు సినీ పరిశ్రమకు ఆక్సిజన్‌లాంటి సక్సెస్‌గా అభివర్ణించారు. థియేటర్లను మళ్లీ ప్రేక్షకులతో కళకళలాడేలా చేసిన చిత్రంగా కొనియాడారు.
ప్రస్తుతం ‘పెద్ది’ అన్ని ప్రాంతాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతూ రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది.
