హనుమాన్ సినిమాతో పాన్-ఇండియా స్థాయిలో సూపర్ హిట్ ఇచ్చిన హీరో తేజ సజ్జ, ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న కొత్త యాక్షన్ డ్రామా మిరాయ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో టీ.జి. విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
మొదట ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు వారం రోజుల వాయిదా వేసి సెప్టెంబర్ 12న రిలీజ్ చేయాలని నిర్ణయానికి వచ్చారని సినీ వర్గాల్లో సమాచారం. ఆగస్టు 28న ట్రైలర్ లాంచ్ సమయంలోనే ఈ కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.
అయితే ఈ వాయిదా వెనుక కారణం ఏమిటని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సమాచారం ప్రకారం, మిరాయ్ సినిమా పూర్తిగా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆధారంగా నిర్మితమవుతోంది. సినిమాలో సింహభాగం సీజీ వర్క్‌పై ఆధారపడి ఉండటంతో, మొత్తం అవుట్‌పుట్‌ను సెప్టెంబర్ 1 నాటికి పూర్తి చేస్తారని అంచనా వేశారు. కానీ ఫైనల్ అవుట్‌పుట్ వచ్చాక కొన్ని టెక్నికల్ కరెక్షన్స్ అవసరమైతే, అవి తక్షణమే చేయడం కష్టమవుతుందని యూనిట్ భావించినట్లు తెలుస్తోంది.
అందుకే తడబాటు లేకుండా, సినిమా నాణ్యతను దెబ్బతీయకుండా, ప్రేక్షకులకు మరింత మెరుగైన అనుభవం ఇవ్వాలని భావించి రిలీజ్ డేట్‌ను సెప్టెంబర్ 12కి మార్చినట్లు తెలుస్తోంది.