కాంతారా(Kantara)తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి(Rishab Shetty), ఇప్పుడు అదే సిరీస్‌కు ప్రీక్వెల్‌గా కాంతారా: ఛాప్టర్ 1 (Kantara Chapter 1)తో వస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలను మరింత పెంచింది.
సుమారు మూడు నిమిషాల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్, ప్రారంభం నుంచే ఒక గంభీరమైన టోన్ సెట్ చేసింది. శివుడి కుమారుడు తన తండ్రి అదృశ్యమైన అడవిలో అడుగుపెట్టే సన్నివేశంతో ఆరంభమవుతూ, ట్రైలర్ లోభం అనే ప్రధానాంశం చుట్టూ తిరుగుతుంది. ఒక రాజు ప్రజల్ని అణగదొక్కిన తీరు, దానికి వ్యతిరేకంగా జరిగిన ప్రజల తిరుగుబాటు చూపించే సన్నివేశాలు ట్రైలర్‌లో ఉత్కంఠను రేపుతున్నాయి.
ప్రకృతి, జానపదం, ఆధ్యాత్మికత—ఈ మూడింటి మేళవింపుతో ట్రైలర్ సాగింది. అయితే ఈసారి దైవీయ అంశాలను చాలా పరిమితంగా చూపించారు. బహుశా సినిమా థియేటర్లలో ఆ ఎలిమెంట్స్‌ను పూర్తి స్థాయిలో అనుభవించాలని టీమ్ భావించి ఉండవచ్చు.
టెక్నికల్‌గా సినిమా మరింత ఎత్తుకు వెళ్లబోతోందని ట్రైలర్ చెబుతోంది. అర్వింద్ కాశ్యప్ సినిమాటోగ్రఫీ కళ్లుచెదిరేలా ఉంది. సురేష్ సంకలన్ ఎడిటింగ్, అజనీష్ లోకనాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ని మరో స్థాయికి తీసుకెళ్లాయి.
హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించగా, రుక్మిణి వాసంత్, జయరాం, గుల్షన్ దేవయ్య వంటి కీలక నటులు భాగమయ్యారు.
మొత్తానికి, కాంతారా: ఛాప్టర్ 1 ట్రైలర్ (Kantara Chapter 1 Trailer) అద్భుతమైన విజువల్స్‌తో పాటు లోతైన థీమ్‌ను చూపిస్తూ, సినిమాపై అంచనాలను గగనానికి చేర్చింది. థియేట్రికల్ అనుభవం ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
కాగా, ఈ చిత్రం అక్టోబర్ 2, 2025న విడుదల కానుంది.