1978 సెప్టెంబర్ 22… తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజు ‘ప్రణం ఖరీదు’ సినిమాతో తెరపైకి వచ్చిన ఓ యువకుడు… తరువాత మెగాస్టార్ చిరంజీవిగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు 47 ఏళ్ల మెరిసే సినీప్రస్థానం.
ప్రాణం ఖరీదులో చిరంజీవి చిన్న పాత్రలో కనిపించినప్పటికీ, ఆయన చూపిన నటనా తీరు, తెరపై తళుక్కుమన్న ఆ తేజం చూసి అప్పటి నుంచే ఇండస్ట్రీలో కొత్త తార పుట్టిందని అందరూ గమనించారు. సామాజిక సమస్యల్ని బలంగా చూపిన ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయింది.
ఇప్పుడు 47 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భంలో అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటూ, “ఇండస్ట్రీకి చిరంజీవి వచ్చిన రోజు మా పండుగ రోజు” అని కామెంట్లు చేస్తున్నారు. ఎక్కడ చూసినా #47YearsOfChiranjeeviinCinema హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
ఈ సందర్భంగా చిరంజీవి కూడా అభిమానులతో తన భావాలను పంచుకున్నారు:
“ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా ‘చిరంజీవిగా’ మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. ” అని అన్నారు.
అభిమానులు అయితే ఇంకా పెద్ద ఎత్తున సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “చిరంజీవి అంటే మాకే కాదు, తెలుగు సినీ పరిశ్రమకే గర్వకారణం. ప్రాణం ఖరీదు మా మెగాస్టార్ పుట్టినరోజు లాంటిదే” అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.