సినిమా వార్తలు

భుజానికి శస్త్రచికిత్స.. రికవరీ కోసం కేరళకు పవన్ కల్యాణ్

Published by
Srinivas

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం తన ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. పూర్తి స్థాయిలో కోలుకునేందుకు కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకోనున్నట్లు సమాచారం. ఇందుకోసం పవన్ కల్యాణ్ రేపు కేరళకు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది.

కొంతకాలంగా భుజం సమస్యతో బాధపడుతున్న పవన్ కల్యాణ్.. ఇటీవల ముంబైలో రొటేటర్ కఫ్ సర్జరీ చేయించుకున్నారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తైనప్పటికీ.. భుజం కదలికలు సాధారణ స్థితికి రావాలంటే మరింత రిహాబిలిటేషన్ అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం.

వైద్యుల సూచనల మేరకు ఇప్పుడు కేరళలో ఆయుర్వేద ఆధారిత థెరపీని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చికిత్సలో భాగంగా అక్కడ కొంతకాలం విశ్రాంతి తీసుకుంటూ భుజానికి అవసరమైన థెరపీ చేయించుకోనున్నారు. చికిత్స పూర్తయిన తర్వాత తిరిగి తన రాజకీయ, సినీ కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలో సినిమాలకు సంబంధించిన కమిట్‌మెంట్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భుజం పూర్తిగా కోలుకునే వరకు ఆయనకు రికవరీ కీలకంగా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్ నటించిన ‘దే కాల్ హిమ్ ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సుజీత్‌తో ఆయన చేయనున్న ‘ఓజీ 2’ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో అప్పటిలోగా పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు పవన్ కల్యాణ్ ప్రస్తుతం చికిత్స, రిహాబిలిటేషన్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts