
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాంధ్రకు గర్వకారణమైన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనగా, వేలాది మంది ప్రజలు కార్యక్రమానికి తరలివచ్చారు.
ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం పలికేందుకు 13,750 మంది గిరిజన మహిళలు, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు కలిసి సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల నుంచి వచ్చిన గిరిజనులు తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ నృత్యంతో ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ, “పవిత్రమైన ఉత్తరాంధ్రకు రావడం నాకు దక్కిన గొప్ప భాగ్యం” అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
అలాగే, సభా వేదిక నుంచే ప్రధాని రూ.17,912 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇందులో విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్‌ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ యూనిట్, కర్నూలు-IV రిన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టు, పెంచలకొన–యరపాడు బ్రిడ్జి నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.

అదేవిధంగా అనంతపురంలో 2,500 మెగావాట్లు, కర్నూలులో 1,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ పథకాలు, ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే, ఖమ్మం–దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి నాలుగు లేన్ల బైపాస్ రహదారి వంటి పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా దేశానికి అంకితం చేశారు.
విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి పొందూరు ఖాదీ శాలువాతో సత్కారం చేసి, ఉత్తరాంధ్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన బొబ్బిలి వీణను బహూకరించారు.

సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “ఈ విమానాశ్రయం ఉద్యోగాలు, ఉపాధికి కేంద్రంగా మారనుంది. ఉత్తరాంధ్ర యువత అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అవకాశాలే ఇక్కడికి వస్తాయి. ఆ బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటోంది” అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లేలా ప్రభుత్వం ఎకోసిస్టమ్‌ను రూపొందించిందని, అందుకే ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు, జీఎంఆర్ ప్రతినిధులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై తమ సందేశాలను అందించారు.

