కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో రూ.36.6 కోట్ల విలువైన డ్యూయల్ ఎనర్జీ లీనియర్ యాక్సిలేటర్ (LINAC) యంత్రం మంజూరైంది. ఒఎన్‌జీసీ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా ఈ అత్యాధునిక పరికరాన్ని సమకూర్చేందుకు చర్యలు చేపట్టారు.
క్యాన్సర్ రోగులకు ఆధునిక వైద్యం అందించడమే లక్ష్యంగా జీజీహెచ్‌లో రేడియోథెరపీ విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. LINAC యంత్రంతో పాటు సీటీ సిమ్యులేటర్, హెచ్‌డీఆర్ బ్రాకీథెరపీ యంత్రం, డోసిమెట్రీ తదితర అత్యాధునిక పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
కాకినాడలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం అందుబాటులోకి వస్తే కాకినాడతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, అనకాపల్లి, పోలవరం తదితర జిల్లాల పరిధిలోని వందలాది మంది క్యాన్సర్ రోగులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్ ప్రధానంగా క్యాన్సర్ రిఫరల్ కేంద్రంగానే సేవలందిస్తోంది.
రెండు దశాబ్దాలుగా ఆంకాలజీ విభాగంలో పెద్దఎత్తున ఆధునికీకరణ జరగకపోవడంతో పూర్తి స్థాయి క్యాన్సర్ చికిత్సలు అందుబాటులో లేవు. దీంతో రోగులు చికిత్స కోసం హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇది తీవ్ర భారంగా మారుతోంది.
LINAC యంత్రం అందుబాటులోకి రావడంతో రేడియేషన్ థెరపీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది. స్థానికంగానే అత్యాధునిక వైద్య సేవలు పొందే అవకాశం కలగనుంది.
క్యాన్సర్ చికిత్సా కేంద్రం కోసం రెడ్‌క్రాస్ నిధులతో చేపట్టిన సుమారు రూ.7 కోట్ల విలువైన అధునాతన భవన నిర్మాణం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇందులో రేడియోథెరపీ బంకర్ నిర్మాణానికి పుణేలోని అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ బోర్డు ఇప్పటికే అనుమతులు మంజూరు చేసింది. ఈ బంకర్‌లోనే కొత్త LINAC యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
అదేవిధంగా క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు సుమారు రూ.3.5 కోట్ల వ్యయంతో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ వాహనం ద్వారా వివిధ ప్రాంతాల్లో ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందించే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్‌లో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక సీనియర్ రెసిడెంట్, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్‌తో పాటు 15 మంది జూనియర్ రెసిడెంట్లు సేవలు అందిస్తున్నారు. ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావడంతో ఈ నిపుణుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం ఏర్పడనుంది.
కాకినాడ జీజీహెచ్‌లో LINAC యంత్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ సహకారం లభించడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రతిపాదనకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, అవసరమైన సహకారం అందించిన ఒఎన్‌జీసీ ఛైర్మన్ అరుణ్ కుమార్ సింగ్‌కు, రెడ్‌క్రాస్ యాజమాన్యానికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అత్యాధునిక ఆరోగ్య సదుపాయాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.