సినిమా వార్తలు

ఆమె చేసిన పనికి సూపర్ స్టార్ ఫిదా… పెద్ద మనసు చాటుకున్న రజనీకాంత్

Published by
Suresh Thota

మేము పెద్దలం అనుకుంటే సరిపోదు… పెద్ద మనసు ఉండాలి… దానితో ఎదుటి వారికి ఆదర్శంగా నిలవాలి… ఆ కోవకు చెందిన వ్యక్తుల్లో ఒకరు “సూపర్ స్టార్ రజనీకాంత్”. ఈ సంఘటన ద్వారా ఆయన తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. ఎందరికి స్పూర్తి ప్రదాత గా నిలుస్తున్నారు. ఏ వ్యక్తి అయినా ఒక రంగంలో పేరు ప్రఖ్యాతలు సాధించినప్పుడు వాళ్ళని అభినందించడం అనేది… సర్వసాధారణంగా జరిగే విషయమే… వాళ్ళు సాధించారు కాబట్టి.

కానీ నిజాయితీగా ఉండటం అనేది చాలా కష్టం తో కూడిన వ్యవహారం. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న రోజుల్ని చూస్తే… భయం వేస్తుంది. నమ్మకం గా పని చేసిన ఇంటిలోనే, దొంగతనం చేసి అవసరమైతే అన్నం పెట్టిన చేతుల్నే కాదు… ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. రోజులు, మనుషులు అలా తయారు అయిపోతున్న ఈ రోజుల్లో… మొన్న చెన్నై లో జరిగిన ఒక సంఘటన నిజాయితీ కి నిలువెత్తు నిదర్శనం గా నిలిచింది.

చెన్నై లోని టీ. నగర్ ప్రాంతంలో పారిశుధ్య కార్మికురాలు గా పనిచేస్తున్న పద్మ అనే మహిళ కు, 2026 జనవరి 11 తేదీన, ముప్పాత్తమ్మన్ కోయిల్ వీధిలో ఒక సంచి రోడ్డు పై కనిపించింది. దానిని ఆమె తెరచి చూడగా 45 తులాల బంగారం అందులో ఉంది. ఏ మాత్రం ఆ బంగారానికి ఆశ పడకుండా, వెంటనే తన పై అధికారులకు ఈ విషయాన్ని తెలిపి, నేరుగా పాండిబజార్ పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులు కు అందజేసింది. ఆమె నిజాయతీని గుర్తిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, జనవరి 12 వ తేదీన,సోమవారం నాడు ఆమెను సెక్రటేరియట్‌కు పిలిపించుకుని 1 లక్ష నగదు పురస్కారంతో సన్మానించారు.

పద్మ నిజాయతీ గురించి తెలుసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆమెను ఫిబ్రవరి 3వ తేదీన, పోయెస్ గార్డెన్లోని తన నివాసానికి ఆమెను పిలిపించుకున్నారు. ఆమెను శాలువాతో సత్కరించి, రెండు తులాల బంగారు గొలుసును కానుకగా అందించారు. ఆమె కుటుంబ సభ్యులతో ముచ్చటించి, సమాజంలో ఇలాంటి నిజాయతీ కలిగిన వ్యక్తులు ఉండటం గర్వకారణమని ప్రశంసించారు. ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సమాజంలో ఇంకా మంచి అనేది మిగిలి ఉంది. పద్మ వంటి వ్యక్తులు ఉండటం మన సమాజానికి ఎంతో గర్వకారణం అని రజనీకాంత్ అన్నారు.

ఇటువంటి మంచి చేసేవాళ్ళని మన సెలబ్రిటీలు, హీరోలు, రాజకీయ నాయకులు ఇలా సన్మానించి వాళ్ళకి ప్రోత్సాహకాలు అందిస్తే… సమాజంలో ఒకరి నుండి మరొకరు ప్రేరణ పొంది… సమాజం బాగుపడుతుంది అని తమిళ, తెలుగు రాష్ట్రాల్లో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఏదేమైనా ఇది నిజాయితీకి ఉన్న బలం.

Suresh Thota

Recent Posts