వార్తలు

తుంగభద్ర త్రైపాక్షిక స్నేహం… వెనుక క్షేత్రస్థాయి సవాళ్లు

Published by
Suresh Thota

కర్ణాటకలోని హోస్పేట వేదికగా తుంగభద్ర జలాశయ నూతన క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవంలో ఆవిష్కృతమైన దృశ్యం.. భారత రాజకీయాల్లో, ముఖ్యంగా అంతర్రాష్ట్ర జల వివాదాల చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ సమక్షంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకి రావడం, పక్కపక్కనే నిలబడి గేట్లను ప్రారంభించడం దేశ సమాఖ్య స్ఫూర్తికి అద్దం పట్టింది. “రాష్ట్రాలు, ప్రభుత్వాలు వేరైనా లక్ష్యం ఒక్కటే” అనే నినాదంతో సాగిన ఈ ముగ్గురు నేతల కలయిక సాగునీటి రంగంలో సరికొత్త “తుంగభద్ర స్ఫూర్తి”ని చాటింది. అయితే, ఈ చారిత్రాత్మక కలయిక కల్పిస్తున్న ఆశాజనక స్పూర్తి వెనుక… తీవ్రమైన ఆర్థిక భారం, ప్రాంతీయ సెంటిమెంట్లు, క్షేత్రస్థాయి ఆటంకాల రూపంలో బలమైన ప్రతికూలతలు కూడా దాగి ఉన్నాయనేది పచ్చి నిజం.

సానుకూల అంశాలను చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. దశాబ్దాలుగా జల వివాదాలు అనగానే కోర్టులు, ట్రిబ్యునళ్ల చుట్టూ తిరగడం, రాజకీయ విమర్శలు చేసుకోవడం మనకు తెలుసు. కానీ, ఆ పాత మొండి పట్టుదలలకు స్వస్తి పలికి, సమస్యలను కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చ నే ఒక ఆరోగ్యకరమైన మార్పుకు ఈ ముగ్గురు నేతలు శ్రీకారం చుట్టారు.

దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వ్యాఖ్యానించినట్టు సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు. వాటి పునరుద్ధరణ ద్వారా 70 ఏళ్ల నాటి ప్రాజెక్టు భద్రతను కాపాడుకుంటూ, రూ. 51 కోట్ల వ్యయంతో కేవలం 6 నెలల రికార్డు కాలంలో 33 గేట్లను మార్చడం అద్భుత ఇంజనీరింగ్ విజయం. ఇది రాయలసీమ, పాలమూరు, బళ్లారి ప్రాంతాలలో లక్షలాది మంది రైతుల్లో సాగునీటిపై ధీమాను పెంచింది.

ఒకరి సమస్యను మరొకరు గౌరవించే వాతావరణం ఇక్కడ కనిపించింది. ఆర్డీఎస్ (RDS) కాలువ కింద తెలంగాణకు 10 టీఎంసీల అన్యాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగంగానే ప్రస్తావించగా, దానికి ఏపీ, కర్ణాటక నేతలు అభ్యంతరం చెప్పకుండా, తదుపరి “బళ్లారి సమావేశం”లో చర్చిద్దామని సానుకూలంగా స్పందించడం విశేషం.

కాని ఈ సమావేశం మాటున పొంచివున్న నష్టాలు, సవాళ్లు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యమైనది పూడికతీత, కొత్త గేట్ల ఏర్పాటుతో డ్యామ్ భద్రత పెరిగింది కానీ, జలాశయంలో పేరుకుపోయిన మట్టి వల్ల 30 టీఎంసీ ల నీరు నిల్వ సామర్థ్యం తగ్గింది. ఆ పూడిక తీయాలంటే ప్రస్తుతం మన దగ్గర సాంకేతిక పరిజ్ఞానం, ఆశించిన స్థాయిలో లేదు. సరే విదేశీ నిపుణులు సహాయం తీసుకుందామన్న, ఈ పూడికను తీయడానికి సుమారు రూ. 6,000 కోట్ల నుండి రూ. 9,000 కోట్లు ఖర్చవుతుందని ఒక అంచనా. సరే పూడిక తీసిన మట్టి ఎక్కడ పోయాలి అన్నది మరొక ప్రశ్న. దీనికన్నా “నవలి” రిజర్వాయర్ కట్టడమే మేలు అని కొందరి భావన, కాని అక్కడ భూమి నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి. ఒకవేళ ప్రత్యామ్నాయంగా “నవలి” రిజర్వాయర్ కట్టాలన్నా రూ. 15,000 కోట్ల భారీ బడ్జెట్ కావాలి. సరే “ప్రొ-రాటా” (Pro-rata) పద్ధతిలో ఆయా రాష్ట్రాల నీటి వాటా ప్రకారం (కర్ణాటక 66%, ఏపీ 27%, తెలంగాణ 7%) ఈ నిధులను సమీకరిద్దాం ఆయా రాష్ట్రాలనుండి అంటే, ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఆయా రాష్ట్రాల ఖజానాలకు ఇది మోయలేని భారం. కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి మీద ఇది ఆధారపడి ఉంది.

ఆర్డీఎస్ కాలువ ఆధునికీకరణపై స్థానిక ప్రజలు వ్యతిరేకత వ్యక్త పరుస్తున్నారు. పాలమూరు, గద్వాల్ రైతులకు న్యాయం జరగాలంటే కర్ణాటక పరిధిలోని ఆర్డీఎస్ కాలువలకు కాంక్రీట్ లైనింగ్ పనులు చేయాలి. కానీ, కాలువలు బాగుచేస్తే నీరంతా కిందికి (తెలంగాణకు) వెళ్ళిపోతుందని, తమకు నీరుండదని కర్ణాటకలోని రాయచూర్, బళ్లారి ప్రాంతాల రైతులు ఈ పనులను అడ్డుకుంటున్నారు. మూడు రాష్ట్రాల సీఎంలు టేబుల్ మీద మాట్లాడుకున్నా, క్షేత్రస్థాయిలో సొంత రాష్ట్ర రైతులకు నచ్చజెప్పడం కర్ణాటక సిఎం డి.కె. శివకుమార్‌కు అంత తేలిక కాదు.

రాజకీయ ప్రయోజనాలు తో పాటు, కరువు భయాలు వెంటాడుతున్నాయి. “ఎల్ నినో” ప్రభావం తో ఈ సంవత్సరం వర్షాలు ఇప్పటివరకు ఆశాజనకంగా కురవలేదు. ప్రస్తుతం వర్షాలు బాగుండి, పొరుగు రాష్ట్రాల్లో అనుకూల వాతావరణం ఉండటంతో నేతలు బాగానే స్పందించారు. కానీ రేపు ఎన్నికలు వచ్చినప్పుడో లేదా వర్షాభావ పరిస్థితులు (కరువు) ఏర్పడినప్పుడో ప్రాంతీయ సెంటిమెంట్లు పైచేయి సాధిస్తాయి. ప్రతిపక్షాలు కూడా అంది వచ్చిన అవకాశం గా తీసుకుంటాయి కాని, దేశ రైతులు అందరూ ఒక్కటే అనే ఆలోచన చేయవు. రాజకీయమే పరమావధిగా ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికే ప్రయత్నిస్తాయి. అప్పుడు “మా రైతులకు కాదని పక్క రాష్ట్రానికి నీళ్లివ్వం” అని స్థానిక నాయకులు, ప్రతిపక్షాలు ఒత్తిడి తెస్తే, ఏ సీఎం కూడా దానికి ఎదురువెళ్లలేరు. అప్పుడు మళ్లీ పాత వివాదాలు మొదటికి వచ్చే ప్రమాదం ఉంది.

కేంద్ర హామీలపై స్పష్టత లేదు, దేశవ్యాప్తంగా డ్యామ్‌లలో పూడిక తీసేందుకు కేంద్రం “జాతీయ విధానాన్ని” తెస్తామని ప్రకటించినప్పటికీ, దానికి సంబంధించిన నిధుల కేటాయింపులు, గ్రాంట్లపై పక్కా హామీలు ఇంకా రాలేదు. కేంద్ర ప్రభుత్వం 60% నుండి 90% వరకు భారం మోయకపోతే, ఈ ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితమవుతాయి.

ఉమ్మడి తుంగభద్ర క్రస్ట్ గేట్ల మార్పిడి అనేది, ప్రముఖ ఇంజనీరింగ్ నిపుణులు కన్నయ్య నాయుడు సాంకేతికపరంగా సాధించిన విజయం అద్భుతమైనది మాత్రమే, అసలైన జల పంపిణీ సవాళ్లు, పూడికతీత, నిధుల కొరత వంటి ఆర్థిక, సామాజిక సమస్యలు మున్ముందు రాబోయే “బళ్లారి త్రైపాక్షిక సమావేశం”లో ఎదురుకానున్నాయి. ఈ ముగ్గురు నేతల కలయిక కేవలం ఒక వేడుక ఫొటోగా మిగిలిపోతుందా.. లేదా దశాబ్దాల జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందా అనేది రాబోయే రోజుల్లో, వారు క్షేత్రస్థాయి సవాళ్లను, ప్రతికూలతల ను ఎలా అధిగమిస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా…

ముగింపు: “తుంగా పానం …. గంగా స్నానం” అన్నారు పెద్దలు. అందరికీ ఆ తుంగా నీటితో దాహం తీరాలని, సాగునీరు, తాగునీరు తో మూడు రాష్ట్రాలు కళకళ లాడాలని ఆశిద్దాం.

“పొలాలను తడపాల్సిన నీరు సముద్రం పాలు కాకూడదు” అనే సమున్నత ఆశయంతో…. పడిన ఈ మొదటి అడుగు ప్రశంసనీయం. అన్నిటిలోనూ రాజకీయాలే చూడకుండా, మనమంతా భారతీయులం అనే స్పూర్తి అందరిలోనూ కలగాలని, ఈ స్ఫూర్తి మాటలకే పరిమితం కాకుండా ఆచరణలోనూ నిలవాలని ఆశిద్దాం.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.