
టాలీవుడ్ లో కొన్ని రోజులుగా “ఆ నలుగురు” అనే పదబంధం ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లు బంద్ పెట్టాలనే నిర్ణయం వెనక “ఆ నలుగురు” ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. అల్లు అరవింద్ బయటకొచ్చారు. “ఆ నలుగురు” లో తను లేనని స్పష్టం చేశారు. ఆ తర్వాత దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టారు. తను కూడా లేనని స్పష్టం చేశారు.
మరి వీళ్లిద్దరూ లేకపోతే “ఆ నలుగురు” ఎవరు? దీనిపై తాజాగా తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్, అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ స్పందించారు. “ఆ నలుగురు” ఎవరనేది స్పష్టం చేశారు. దిల్ రాజు, శిరీశ్, సురేష్ బాబు, సునీల్ నారంగ్.. వీళ్లే “ఆ నలుగురు” అంటూ సంచలన ప్రకటన చేశారు సత్యనారాయణ.
తూర్పుగోదావరి జిల్లాలో థియేటర్లు బంద్ చేయాలనే నిర్ణయాన్ని సత్యనారాయణ తీసుకున్నారంటూ దిల్ రాజు ఆరోపించిన సంగతి తెలిసిందే. అదే టైమ్ లో జనసేన నుంచి అతడ్ని తొలిగించారు. దీనిపై సత్యనారాయణ బాధపడ్డారు. తన పేరును బంద్ వివాదంలోకి లాగారని ఆరోపించారు.
సినిమాల్లేకపోతే థియేటర్లు మూసేయాల్సి వస్తుందని మాత్రమే చెప్పానని, పర్సంటేజీ ఇవ్వకపోతే మూసేస్తామంటూ ఎక్కడా హెచ్చరికలు జారీచేయలేదని స్పష్టం చేశారు. దిల్ రాజు, కమల్ హాసన్ ను మించి నటించారని, తన రాజకీయ భవిష్యత్తును దెబ్బకొట్టారని, దీనిపై కోర్టుకు వెళ్తానని అన్నారు సత్యనారాయణ.
