ప్రముఖ టీవీ నటుడు, యాంకర్‌గా పేరు పొందిన ఖయ్యూమ్ అలియాస్ లోబోకి కోర్టు శిక్షను విధించింది. జనగామ కోర్టు తాజాగా వెలువరించిన తీర్పులో, 2018లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా కూడా విధించింది.
వివరాల్లోకి వెళ్తే, 2 2018లో వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న రహదారిలో లోబో మద్యం మత్తులో వాహనం నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో లోబో వాహనం ఓ ఆటోని ఢీకొట్టింది. ఆ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ప్రాంతంలో కలకలం రేపింది.
మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. సాక్ష్యాధారాలను సేకరించి, లోబోపై నిర్లక్ష్యంగా వాహనం నడపడం, మద్యం సేవించి డ్రైవ్ చేయడం, ప్రమాదవశాత్తు మరణానికి కారణమవడం వంటి కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
కొన్ని సంవత్సరాలుగా సాగిన విచారణ అనంతరం, కోర్టు చివరగా లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఈ తీర్పు టెలివిజన్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో చర్చనీయాంశమైంది. యాంకర్‌గా, కామెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లోబోపై ఇలాంటి కేసు రావడం, ఇప్పుడు కోర్టు శిక్ష విధించడం ఆయన కెరీర్‌పై కూడా ప్రభావం చూపనుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.