సినిమా వార్తలు

నేల కొరిగిన ‘స్వర శిఖరం’… ఆశా భోంస్లే

Published by
Suresh Thota

భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన స్వరంతో ఓలలాడించి, దశాబ్దాల పాటు మంత్ర ముగ్ధులను చేసిన స్వర సాహితీ శిఖరం “ఆశా భోంస్లే” ఇక లేరు. ఆమె మరణం కేవలం ఒక గాయని గా ముగింపు కాదు. భారతీయ సంగీత చరిత్రలో ఒక మహా అధ్యాయం ముగిసినట్టు. తన జీవితంలో జరిగిన సంఘటనలు మనో ధైర్యంతో ఎలా ఎదుర్కోవాలో లోకానికి తెలియచెప్పి… ఎందరికో స్పూర్తి గా నిలిచిన ధీశాలి.

“ఆశా భోంస్లే” జీవితంలో సంగీతం మాత్రమే కాదు, కుటుంబం, ప్రేమ, విభేదాలు, తిరిగి కలయికలతో నిండిన ఒక గాథ. ఆమె కుటుంబం సంగీతానికి పుట్టినిల్లు. ఆమె తండ్రి “దీనానాథ్ మంగేష్కర్” శాస్త్రీయ సంగీతంలో ప్రముఖుడు. సోదరి “లతా మంగేష్కర్”… భారతీయ గాన ప్రపంచానికి ప్రతీక. ఈ కుటుంబంలో పుట్టిన ఆశా, సంగీతాన్నే శ్వాసలా స్వీకరించింది. అయితే, ఈ సంగీత కుటుంబంలోనూ ఆమె జీవితం అంత సులభంగా సాగలేదు. తన నిర్ణయాలతో, తన జీవితాన్ని తానే మలచుకోవాలనే ధైర్యం ఆమెకు చిన్న వయస్సులోనే కలిగింది.

“ఆశా భోంస్లే” మొదటి ప్రేమ వివాహం జీవితంలో అత్యంత కీలకమైన, బాధాకరమైన అధ్యాయం గా ముగిసింది. ఆమె తన 16 ఏళ్ల వయస్సులోనే, తన సోదరి లతా మంగేష్కర్ వ్యక్తిగత కార్యదర్శి అయిన గణపత్‌రావు భోంస్లే తో ప్రేమలో పడి, తన కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం తో ఇంటి నుండి పారిపోయి వివాహం చేసుకుంది. ఈ నిర్ణయం ఆమెను తన కుటుంబం నుండి దూరం చేసింది. ముఖ్యంగా లతా మంగేష్కర్‌తో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వివాహం తర్వాత ఆమెకు ముగ్గురు పిల్లలు జన్మించారు. కానీ ఈ దాంపత్య జీవితం ఆనందంగా సాగలేదు.

భర్త, అత్తింటి నుంచి వచ్చిన ఒత్తిళ్లు, అవమానాలు, అనేక కష్టాలు ఆమెను మానసికంగా దెబ్బతీశాయి. చివరికి, గర్భవతిగా ఉన్న సమయంలోనే ఆమెను ఇంటి నుండి గెంటివేయడం ఆమె జీవితంలో ఒక బాధాకరమైన సంఘటన. ఆ పరిస్థితుల్లో తిరిగి తన తల్లి ఇంటికి చేరి, ఒంటరిగా పిల్లలను పెంచుకుంటూ, తన కెరీర్‌ను తిరిగి ప్రారంభించడం ఆమె పట్టుదలకు, ధైర్యానికి నిదర్శనం. ఈ దశ ఆమెను బలహీనురాలిగా చేయలేదు. బలమైన వ్యక్తిగా మలిచింది. తనను తానే ఒక శిల్పం గా చెక్కుకున్నది.

తన జీవితంలో ప్రేమకు రెండో అవకాశం ఆర్ డి బర్మన్ రూపంలో తలుపు తట్టింది. సంగీతం కలిపిన బంధం ఇది, సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మాన్ తో ఏర్పడిన అనుబంధం, వివాహానికి దారి తీసింది. ఆయన ఆమె కన్నా వయస్సులో 6 సంవత్సరాలు చిన్నవాడు. ఆమె జీవితంలో కొత్త వెలుగు తీసుకొచ్చింది ఈ బంధం, భారతీయ సంగీతానికి కొత్త శైలిని అందించిన సృజనాత్మక కలయిక. వారిద్దరి కలయిక లో వచ్చిన పాటలు “దమ్ మారో దమ్”, “పియా తూ అబ్ తో ఆజా” సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. ఇవే కాక అనేక హిట్ గీతాలతో కొత్త ఒరవడి సృష్టించారు.

తన స్వరం జీవన పోరాటం నుంచి హిమాలయ శిఖరాగ్రం వరకు చేర్చింది. వ్యక్తిగత జీవితంలోని కష్టాలు, కుటుంబ విభేదాలు ఇవన్నీ ఆశా భోంస్లేను ఆపలేకపోయాయి. ఆమె తన స్వరంతోనే తనకు గుర్తింపు తెచ్చుకుంది. సోదరి లతాతో పోలికలు, పోటీ ఉన్నప్పటికీ, తన స్వరం కు “ఆర్ డి బర్మన్” సంగీతం తొడవ్వడం తో యావత్ భారతం ఈమే పాటలతో హోరెత్తిపోయింది. చివరికి అక్క చెల్లెళ్లు ఇద్దరూ భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి చేర్చిన మహానుభావులుగా నిలిచారు.

భారత దేశంలో ప్రతిష్టాత్మక అవార్డులు ఆమె ప్రతిభకు పట్టం కట్టాయి. ఆమెను వరించిన అవార్డ్స్… 2000వ సంవత్సరం లో, భారత దేశంలో సినీ రంగంలో అత్యున్నత పురస్కారం “దాదాసాహెబ్ ఫాల్కే” అవార్డు అందుకున్నారు. దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం “పద్మ విభూషణ్” 2008 అందుకున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డులు (2 సార్లు) ఆవిడ గాన ప్రతిభకు జాతీయ గుర్తింపు కాగా, బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులుఫిల్మ్‌ఫేర్ అవార్డులు 7 సార్లు అందుకున్నారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డు (2011) ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన గాయని. ఆశా భోంస్లే కేవలం గాయని మాత్రమే కాదు, ఆమె ఒక స్ఫూర్తి. కుటుంబ విభేదాలు, వ్యక్తిగత జీవితంలోవైఫల్యాలు, సామాజిక ఒత్తిళ్లు ఇవన్నీ ఎదుర్కొని, తన ప్రతిభతో ప్రపంచాన్ని గెలుచుకున్న మహిళ.

ముగింపు : ఆశా భోంస్లే జీవితం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. జీవితంలో ఎంత కష్టం వచ్చినా, మన ప్రతిభకు సంకల్పం తోడు అయితే అత్యున్నత స్థాయికి చేరుకోవడం సులభమే అని రుజువు చేస్తుంది. ఆమె వెళ్లిపోయినా, ఆమె పాటలు, ఆమె జీవితం, ఆమె పోరాటం ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తాయి.

‘శరీరానికే మరణం స్వరానికి కాదు’…. ఆమె స్వర మాధుర్యాన్ని రాబోయే తర తరాలు ఎప్పటికీ ఆస్వాదిస్తూనే ఉంటాయి. ప్రతి ఇంటా ఆమె పాట మార్మోగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆమె అమరగాయని “ఆశా భోంస్లే” కదా…

Suresh Thota