మొత్తం సినిమా ప్రేమికులు ఎదురుచూస్తున్న “వార్ 2” ట్రైలర్ (War 2 Trailer) ఎట్టకేలకు విడుదలైంది. హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ తొలి కలయికలో వస్తున్న ఈ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో మరో కీలక అధ్యాయంగా నిలిచేలా కనిపిస్తోంది.
ట్రైలర్ ప్రారంభంలో హృతిక్ రోషన్ తన గుర్తింపుని, పేరుని, ఇంటిని అన్నింటిని త్యజించి “పేరు లేని నీడ”లా మారతానని ప్రతిజ్ఞ చేస్తాడు. దానికి వెంటనే ఎన్టీఆర్ ఓ అద్భుతమైన బేర్‌చెస్టెడ్ ఎంట్రీ ఇస్తూ, ఎవ్వరూ చేయలేని పనిని నేను చేసి చూపిస్తాను.. ఎవ్వరూ పోరాడలేని యుద్దాన్ని నేను పోరాడతాను అంటూ రంగంలోకి దిగుతాడు. మొదటి వార్ సినిమాకు కనెక్ట్ చేస్తూ టైగర్ ష్రాఫ్ ఫోటో చూపించడం గమనార్హం.
ట్రైలర్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్, భావోద్వేగపూరిత ఘర్షణలు, దేశభక్తి పంథా ప్రధానంగా కనిపిస్తున్నాయి. హృతిక్ రోషన్ – కియారా అద్వానీ జంట మధ్య ఓ రొమాంటిక్ ట్రాక్‌ను సూచించగా, ఎన్టీఆర్ పాత్ర పూర్తి స్థాయిలో తన మిషన్ మీదే దృష్టి సారించింది.
“ఈసారి హీరోలు పడిపోతారు… యోధులు లేస్తారు” అనే శక్తివంతమైన డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తుంది. “ఇండియా ఫస్ట్” అని ఇద్దరూ ఏకకంఠంగా చెప్పే సన్నివేశం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలకు తగ్గట్టుగానే ఉండబోతోందని సంకేతాలు ఇస్తోంది. ఆదిత్య చోప్రా నిర్మించిన “వార్ 2” ఆగస్టు 14, 2025న భారీ స్థాయిలో విడుదల కానుంది.