టాలీవుడ్‌లో మలయాళ చిత్రాలకు ఉన్న క్రేజే వేరు. మలయాళ చిత్రాల్లో భారీ యాక్షన్ సీన్స్, భారీ కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక దర్శకుడు గిరీష్ ఏడీ విషయానికి వస్తే.. మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తికరమైన దర్శకుల్లో ఒకరు. సింపుల్ కథతో మన రోజువారీ జీవితంలో కనిపించే సహజమైన, హాస్యభరితమైన పరిస్థితులన నడుమ కథను ముందుకు తీసుకెళ్లడంలో దిట్ట. మరి ఆయన ఈ చిత్రాన్ని ఎలా నడిపించారు? సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
కథేంటంటే..
కాలేజీ స్టూడెంట్ అయిన యాష్లీ (మమితా బైజు)కు గిటార్ ప్లే చేయడం ఆమె హాబీ. యాష్లీ తన కుటుంబంతో కలిసి నగరంలోని కొత్త ప్రాంతానికి వస్తుంది. ఇల్లు మారే సమయంలో తనకు ఎంతో ఇష్టమైన పాత ఆడియో క్యాసెట్ల బాక్స్‌ను తల్లి వద్దని వారిస్తున్నా వినకుండా తీసుకొస్తుంది. పక్క ఇంట్లో జస్టిన్ (నివీన్ పౌలీ) ఫ్యామిలీ ఉంటుంది. జస్టిన్ వయసు పెరిగినా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మాచారిగానే కాలం గడిపేస్తూ ఉంటాడు. అతనితో యాష్లీకి పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త స్నేహంగా మారుతుంది. ఒకసారి తనకు ఇష్టమైన ఆల్టర్నేటివ్ రాక్ బ్యాండ్ ‘బ్రీడర్స్’ గురించి జస్టిన్‌కు కూడా తెలుసని యాష్లీకి తెలుస్తుంది. ఆమె ఆశ్చర్యపోతుంది. అప్పటి వరకూ అతనిపై ఉన్న అభిప్రాయం ఒక్కసారిగా మారిపోతుంది. యాష్లీ-జస్టిన్‌ల స్నేహం ప్రేమగాను మారుతుంది. అయితే ఏజ్ గ్యాప్ కారణంగా పెళ్లికి ఆష్లే, బెత్లెహాం కుటుంబం యూనిట్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వారి లవ్ బ్రేకప్ జరిగి పై చదువులకు విదేశాలకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఓ పెళ్లి కోసం మళ్లీ తన ఊరికి వస్తుంది. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అసలు జస్టిన్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఎందుకు మిగిలిపోయాడు? అసలు బెత్తెహాం కుటుంబ యూనిట్ అంటే ఏమిటి? వంటి అంశాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
మమితాబైజుకే ఇలాంటి స్క్రిప్ట్స్ రావడం ముందుగా ఆసక్తికరం. ఇప్పటికే విశ్వనాథన్ అండ్ సన్స్ కూడా ఇదే తరహా కథ. తనకంటే వయసులో పెద్దవాడైన వ్యక్తిని ప్రేమించడం. పెళ్లి చేసుకోవాలనుకోవడం. మార్పులున్నా కూడా కామన్ పాయింట్ అయితే ఏజ్ గ్యాప్ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకోవడమే. యాష్లీ తమ గ్రామం, తన చిన్న ఇంటిని వదిలి కుటుంబంతో కొత్తింటికి వచ్చాక యాష్లీ ఏదో కోల్పోయినట్టుగా దిగులుగా ఉంటుంది. అయితే కొద్దిరోజుల్లోనే ఆమె అక్కడి వారితో కలిసిపోతుంది. దర్శకుడు గిరీష్ ఏడీ ప్రేక్షకులను సైతం ఇలాగే చక్కగా కథలోకి తీసుకెళ్లారు. అక్కడి ప్రతి పాత్రలోనూ మనకు తెలిసిన ఏదో ఒక వ్యక్తి కనిపిస్తాడు. వాళ్ల మధ్య జరిగే సన్నివేశాలు, సరదా సంభాషణలు చూస్తుంటే మన స్నేహితులతో ఉన్న అనుభూతి కలుగుతూ ఉంటుంది. యాష్లీ, ఆమె కుటుంబం మినహా అక్కడ ఉన్నవారందరి మధ్య సహజమైన అనుబంధం మనకు కనిపిస్తుంది. ఏదో స్క్రిప్ట్ ప్రకారం కథ నడుస్తున్నట్టుగా అనిపించదు. జస్టిన్–యాష్లీ మధ్య ఉన్న వయసు తేడా కారణంగా వారి ప్రేమ సంబంధం తప్పుగా కనిపించే అవకాశం ఉంటుంది. కానీ దానిని డీల్ చేసిన తీరు ఆసక్తికరం. చాలా సున్నితంగా, జాగ్రత్తగా తెరకెక్కించడంతో తప్పుబట్టడానికి ఆస్కారం కనిపించదు. ఎక్కడా ఈ సంబంధం ఇబ్బందికరంగా కానీ అసహజంగా కానీ అనిపించదు. నటీనటులు, టెక్నికల్ టీం చక్కగా ఒకే లయలో పని చేస్తే సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందనే దానికి ఈ చిత్రమే ఉదాహరణ.
ఎవరెలా నటించారంటే..
సినిమాకు ప్రధాన బలం, నివిన్ పౌలీ, మమితాల నటన. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా సెట్ అయిపోయింది. ఇవన్నీ కలగలిసి వారి మధ్య వయసు తేడా ఆలోచన కూడా మనకు రానివ్వకుండా చేస్తాయి. మమిత అయితే తన పాత్రలో జీవించేసింది. ఏ పాత్రకైనా జీవం పోయగలదని మమిత మరోసారి నిరూపించింది. నివిన్ విషయానికి వస్తే చాలా సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. జస్టిన్ పాత్రకు నివిన్ తప్ప మరొకరు జస్టిఫికేషన్ చేయలేరేమో అన్నట్టుగా నటించారు. రోషన్ షానవాస్, సురేష్ కృష్ణ, షమీర్, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, వినయ్ ఫోర్ట్, శ్రీంద, బిందు పనికర్ అద్భుతంగా నటించారు. చిన్న పాత్ర చేసిన వారు సైతం గుర్తుండిపోయేలా నటించారు.
టెక్నికల్ పరంగా..
ముఖ్యంగా దర్శకుడు గిరీష్ ఏడీ గురించి చెప్పాలి. కథ అసాధారణమైనదేమీ కాదు. కానీ ఈ సినిమాను ఆయన అసాధారణమైనదిగా నడిపించారు. క్లైమాక్స్‌లో భావోద్వేగ సన్నివేశాల్లో సైతం దర్శకుడు కామెడీని వదల్లేదు. విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాను ఓ మెట్టు ఎక్కించింది. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా.. బెత్లెహొమ్ కుటుంబ యూనిట్ ఈ ఏడాది అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.